సాల్విడ్ గుట్టలో చిరుత సంచారం?
ABN, Publish Date - Feb 17 , 2024 | 11:08 PM
సాల్విడ్ గ్రామ పరిధిలోని గుట్టలో చిరుత సంచరిస్తుందన్న నేపథ్యంలో అటవీ అధికారులు ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి రాగా దొంగలై ఉంటారని స్థానికులు భావించారు.
కులకచర్ల, ఫిబ్రవరి 17: సాల్విడ్ గ్రామ పరిధిలోని గుట్టలో చిరుత సంచరిస్తుందన్న నేపథ్యంలో అటవీ అధికారులు ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి రాగా దొంగలై ఉంటారని స్థానికులు భావించారు. ఈక్రమంలో శనివారం ఉదయం వారి కోసం గాలింపు చేపట్టారు. గ్రామ సమీపంలోని గుట్టపై గుహలో దాగి ఉంటారని భావించి చూసేందుకు వెళ్లగా చిరుత ఉన్నట్లు గమనించి భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు. తమను చూసి చిరుత గుండ్ల మధ్య నుంచి కిందకు దూకిందని గ్రామానికి చెందిన దాసరి చెన్నయ్య, సున్నల రాములు తెలిపారు. ఈ విషయాన్ని తహసీల్దార్ మురళీధర్‌కు తెలపగా ఆయన అటవీ అధికారులకు సమాచామిచ్చారు. అటవీశాఖ బీట్ అధికారులు సాయికుమార్, జర్పద్దీన్ గుట్ట వద్దకు చేరుని గుహను పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. కొద్ది దూరంలో మరో గుండుపై కుక్కపిల్ల తల పడి ఉండటాన్ని గమనించారు. అక్కడ సంచరిస్తున్న జంతువును గుర్తించేందుకు ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు. అక్కడ సంచరిస్తున్నది చిరుతనా లేక మరేదైనా జంతువు అనేది ట్రాప్ కెమెరాలో రికార్డు అవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువులను ఇంటివద్దే కట్టేసుకోవాలన్నారు.
Updated Date - Feb 17 , 2024 | 11:08 PM