CM Revanth: ప్రపంచ దేశాలకు ధీటుగా తెలంగాణ.. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్: రేవంత్
ABN, Publish Date - Sep 18 , 2024 | 03:04 PM
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ని బుధవారం ప్రారంభించింది. మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ని బుధవారం ప్రారంభించింది. మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. రేవంత్ సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సీఎం అందుకుతగినట్లే పాలసీని రూపొందించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని అన్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. "ఎంఎస్ఎంఈలు ప్రధానంగా 6 అడ్డంకులను ఎదుర్కుంటున్నాయి. భూమి, మూలధన లభ్యత, ముడిపదార్థాల అందుబాటు, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక సౌకర్యం లేకపోవడం, మార్కెట్‌లతో అనుసంధానం కాలేకపోవడం వంటి అంశాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లు. ఈ అడ్డంకులను తొలగించడానికి 40 ప్రతిపాదనలు చేశాం"అని రేవంత్ పేర్కొన్నారు.
20 శాతం ఎంఎస్ఎంఈలకే..
రాష్ట్రంలో రానున్న రోజుల్లో నిర్మించతలపెట్టిన ప్రతి పారిశ్రామిక పార్కులో 20 శాతం ప్లాట్లు ఎంఎస్ఎంఈల కోసం రిజర్వు చేయనున్నట్లు రేవంత్ వివరించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ట్రిపులార్ మధ్య 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతున్నట్లు చెప్పారు.10 పార్కులలో 5 ఎంఎస్ఎంఈలు ఉంటాయని.. వీటిలోని ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామిక వేత్తలకు 15 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఎంఎస్ఎంఈలను సమర్థవంతంగా అమలుపరిచి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Updated Date - Sep 18 , 2024 | 03:04 PM