HYDRA: కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు మున్నీరవుతున్న పేదలు
ABN, Publish Date - Sep 22 , 2024 | 11:19 AM
భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు.
నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా అధికారులు కూల్చివేయగా.. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్నానంటూ ఓ బాధితుడు విలపించాడు. కూకట్‌పల్లి శాంతి నగర్‌లో బాధితుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ప్రాంతంలో 20కి పైగా కమర్షియల్ షటర్లు నేలమట్టమయ్యాయి.
పేదలపై కర్కశమంటూ విమర్శలు
పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా నిర్మాణాలు కూల్చేముందు మమ్మల్ని చంపేయండి’ అంటూ కొందరు బాధితులు ఏడవడం కనిపించింది. విలువైన సామాన్లు కూడా బయటకి తీసుకోకుండా.. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో దారుణం.. కదులుతున్న బస్సులో అత్యాచారం
క్షమాపణలు చెప్పిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ
Updated Date - Sep 22 , 2024 | 11:26 AM