Petrol Effect: ఇంధనం లేకపోయినా.. భలే డెలివరీ గురూ..
ABN, Publish Date - Jan 03 , 2024 | 10:54 AM
హైదరాబాదు: కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా బుధవారం ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో.. మంగళవారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని నగరం మధ్యాహ్నానికి ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయింది! వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూకట్టి.. ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో..
హైదరాబాదు: కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా బుధవారం ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో.. మంగళవారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని నగరం మధ్యాహ్నానికి ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయింది! వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూకట్టి.. ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆ క్యూలు బంకుల బయట కిలోమీటరు దూరానికిపైగా వ్యాపించి జంక్షన్లు జామైపోయాయి! కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఈ నేపథ్యంలో జొమాటో సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్ గుర్రంపై వెళుతూ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ చేశాడు. పెట్రోలు కొరత ఏర్పడినా.. అటు కస్టమర్లు కూడా ఇబ్బంది పడకుండా తెలివిగా ఆలోచించిన డెలివరీ బాయ్ గుర్రంపై వెళుతూ డెలివరీ చేయడాన్ని నెటిజన్లను ఆకట్టుకుంది. డెలివరీ బాయ్ సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటూ శభాష్ సందరం అంటూ తెగ పొగిడేస్తున్నారు.
కాగా ఆటోనగర్ నుంచి.. వనస్థలిపురం, చింతలకుంట, బీఎన్‌రెడ్డినగర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, సోమాజీగూడ, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ-హైటెక్‌సిటీ రోడ్డు, మాధాపూర్, కొండాపూర్, యూస్‌ఫగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, పద్మారావునగర్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, సీతాఫల్‌మండి.. ఆ పేట, ఈ బస్తీ అనే తేడా లేదు! ప్రతి రోడ్డు.. ప్రతి చౌరస్తా.. వాహనాలతో కిటకిటలాడిపోయాయి. ట్రక్కు డ్రైవర్ల సమ్మె గురించిగానీ.. పెట్రోల్ బంకుల వద్ద రద్దీతో జంక్షన్లు జామైపోయిన విషయంగానీ తెలియక బయటకు వచ్చిన సామాన్యులు చాలా మంది.. ఈ ట్రాఫిక్ దెబ్బకు అల్లాడిపోయారు. సాధారణంగా అరగంట పట్టే దూరానికి రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో.. అడుగుతీసి అడుగు వేసినట్టుగా మంద్రంగా కదులుతున్న ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించలేక.. విలవిలలాడిపోయారు. ‘అనవసరంగా బయటికొచ్చాంరా భగవంతుడా’ అని వాపోయారు. అసలు పెట్రోల్ బంకుల వద్ద బారులుతీరినవారిలో కూడా చాలా మందికి అసలు ఈ సమ్మె ఏమిటి? ఎన్నిరోజులు? అనే విషయాలే తెలీవంటే అతిశయోక్తి కాదు. సమ్మె మూడురోజులని కొందరు.. కాదు వారమని మరికొందరు.. నెలరోజులని ఇంకొందరు.. ఇలా సోషల్‌మీడియాలో ఇష్టారీతిన ప్రచారం చేయడంతో వాటిని నమ్మి వచ్చినవారే చాలా మంది. కారణమేదైనాగానీ.. నగరంలోని వాహనదారులకు, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన ఈ ట్రాఫిక్ రాత్రి దాకా కొనసాగింది.
Updated Date - Jan 03 , 2024 | 10:54 AM