ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత..నండూరి పార్థసారథి కన్నుమూత
ABN, Publish Date - Jun 15 , 2024 | 06:09 AM
తెలుగు పాఠకలోకానికి, సాహితీప్రియులకు ‘నం.పా.సా.’గా చిరపరిచితుడైన ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత, సీనియర్ పాత్రికేయుడు.. నండూరి పార్థసారథి (85) ఇకలేరు. కొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.
సంగీత, నృత్య, నాటక, చిత్ర, శిల్ప కళలపై వందలాది విమర్శనాత్మక వ్యాసాలు
శుక్రవారం ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు పాఠకలోకానికి, సాహితీప్రియులకు ‘నం.పా.సా.’గా చిరపరిచితుడైన ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత, సీనియర్ పాత్రికేయుడు.. నండూరి పార్థసారథి (85) ఇకలేరు. కొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. పార్థసారథి పుట్టింది, పెరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆరుగొలను గ్రామం.
‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు నండూరి రామ్మోహనరావు ఆయన సోదరుడు. ముళ్లపూడి వెంకట రమణ సతీమణి శ్రీదేవి.. పార్థసారథికి సోదరి. 1957లో కథా రచన ప్రారంభించిన ఆయన.. ‘రాంబాబు డైరీ (మూడు భాగాలు)’, ‘పిబరే హ్యూమరసం’, ‘అయోమయ రాజ్యం’, ‘సాహిత్య హింసావలోకనం’, ‘ఖార్ఖానాఖ్యానము’, ‘జేజి మావయ్య పాటలు’ తదితర హాస్య, వ్యంగ్య రచనలతో పాటు ‘స్వరార్ణవం’ ‘సంగీత కళా చరిత్ర’, ‘శ్రీకృష్ణ కథామృతం’, ‘శిఖరాలు- సరిహద్దులు’ తదితర రచనలు చేశారు. సంగీత, నృత్య, నాటక, చిత్ర, శిల్ప, వాస్తు కళలపై సాధికారిక విశ్లేషణలతో ‘రసమయి’ సాంస్కృతిక మాస పత్రికను 2000 నుంచి 2009 వరకు నిర్వహించారు.
లలిత కళలపై కొన్ని వందల విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. 1959 నుంచి 1996 వరకూ ‘ఆంధ్రప్రభ’లో పాత్రికేయుడిగా సేవలందించారు. వెయ్యికి పైగా అరుదైన గ్రామఫోన్ రికార్డులు, కొన్ని వందల పాటల క్యాసెట్లు, సీడీలను నండూరి సేకరించారు. భారతీయ సంప్రదాయ సంగీతంతోపాటు పాశ్చాత్య సంగీత, నృత్యాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలనూ ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో చూడచ్చు. నండూరి పార్థసారథికి.. భార్య సువర్చలా దేవి, కుమారుడు మధు సారథి ఉన్నారు. ముగిసిన అంత్యక్రియలు..నండూరి మృతి పట్ల పలువురు సాహితీ, పాత్రికేయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
‘ప్రత్యేకమైన శైలితో వ్యంగ్య, హాస్య రచనల ద్వారా తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు పొందిన రచయిత నండూరి పార్థసారథి మరణం బాధాకరం’ అంటూ వయోధిక పాత్రికేయ సంఘం ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్ర మూర్తి, చిత్రకారుడు బ్నింతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, రచయితలు విచారం వ్యక్తం చేశారు. ముళ్లపూడి వెంకట రమణ సతీమణి శ్రీదేవి, వారి కుమారుడు, సినీ దర్శకుడు వర ముళ్లపూడి.. పార్థసారథి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కాగా.. నండూరి పార్థసారథి అంత్యక్రియలు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.
Updated Date - Jun 15 , 2024 | 06:09 AM