CM Revanth Reddy: ఎవడన్న టచ్ చేసి చూడండి. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలైతరు.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 07 , 2024 | 04:01 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదంటూ విమర్శిస్తున్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అగ్ని కణికలైతరు.. ఎవడూ మిగలడు.. ఆషామాషీగా వచ్చినోళ్లం కాదు
పదేళ్లు కాంగ్రె్‌సదే అధికారం.. 90 రోజుల్లోనే పలు పథకాలను తీసుకొచ్చాం
పాలమూరుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.. కాంగ్రెస్‌తోనే ఎస్సీల వర్గీకరణ
మోదీని దేశ ప్రధానిగా గౌరవించా.. రాష్ట్రానికి నిధులివ్వకపోతే చాకిరేవు పెడతా
నేను, మంత్రులూ సెలవుల్లేకుండా పని చేస్తున్నాం.. ప్రజాదీవెన సభలో రేవంత్
ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పేరు ప్రకటించిన సీఎం.. కాంగ్రెస్‌లోకి కోనేరు కోనప్ప
మహబూబ్‌నగర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదంటూ విమర్శిస్తున్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ మైదానంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ సభలో ప్రసంగిస్తూ ఈ అంశంపై సీఎం నిప్పులు చెరిగారు. ‘ఎవడన్న టచ్ చేసి చూడండి. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలైతరు.. మానవ బాంబులైతరు.. ఎవడన్న మిగుల్తడేమో నేను చూస్త. అనుకుంటన్నరేమో, తమాషా చేస్తున్నరేమో.. వాన్నో వీన్నో సందులల్ల సక్కలగుల వెట్టి ఏదో చేద్దామని. ఒక్కొక్కన్ని పండవెట్టి తొక్కి పేగులు తీస్కొని మెడల ఏస్కొని ఊరేగుతం బిడ్డా ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకొస్తే. ఆషామాషీగా అల్లాటప్పగా ఒచ్చినోళ్లం కాదు బిడ్డా.. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంట తొక్కుకుంట.. ప్రగతి భవన్‌లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్ల కీడ్చినం’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయని, తాజాగా అధికారంలోకి వచ్చిన తమ పార్టీ కాంగ్రెస్ మరోసారి పదేళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. ప్రజాదీవెనసభలో లోక్‌సభ ఎన్నికలతోపాటు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సీఎం రేవంత్‌రెడ్డి శంఖారావం పూరించారు.
బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లు అధికారంలో ఉండి పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని.. తాము మాత్రం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే పలు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు కాకిలెక్కలు చెప్పుకుంటూ.. భ్రమలు కల్పిస్తూ.. ఎన్నో చిక్కుముడులు వేస్తే.. వాటిని తాము విప్పుతున్నామన్నారు. బీఆర్‌ఎస్ అంటే ఎమిటో తెలుసా అని ఒకాయన తనను అడిగారని, తాను భారత రాష్ట్ర సమితి అని చెబితే.. కాదు కాదు.. బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని చెప్పారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులను చూస్తే అలాగే అనిపిస్తోందన్నారు. ఎస్సీల వర్గీకరణ కాంగ్రె్‌సతోనే సాధ్యమని, ఇప్పటికే మంత్రి దామోదర రాజనర్సింహ సారథ్యంలో ఆ దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. కానీ పదేళ్లు మాదిగలను వంచించి, మోసగించిన దొర దగ్గరకు వెళ్లడం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు న్యాయమా? అని ప్రశ్నించారు. దేశ ప్రధాని తెలంగాణకు వస్తే ఆయనను గౌరవించానని, రాష్ట్రానికి కావాల్సిన నిధులను, పనులను అందరి ముందే అడిగానని.. అంతేగానీ, చెవిలో గుసగుస పెట్టి, తలుపులు మూసి, కడుపులో తలకాయ పెట్టలేదని సీఎం పేర్కొన్నారు. కేంద్రంతో ఘర్షణ ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలుగుతుందనే భావనతోనే ప్రధాని మోదీని సముచితంగా గౌరవించానని, కానీ అడిగిన నిధులు, పనులు మంజూరు చేయకపోతే చాకిరేవు పెట్టే బాధ్యత కూడా తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్నంత బుద్ధి కూడా లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చి 90 రోజులే అవుతోందని, ఇంతలోనే ఏం చేశారని అడుగుతున్న వారు.. 3,650 రోజులు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోదీ, కేడీ పాలమూరుకు జాతీయ హోదా ఇచ్చారా? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తిచేశారా? అని ప్రశ్నించుకోవాలన్నారు. కరీంనగర్‌లో చావు తప్పి కన్ను లొట్టబోయి పాలమూరుకు వస్తే ఆ బేకార్‌గాన్ని ఇక్కడి ప్రజలు గెలిపించారని, కానీ, ఇప్పుడు పాలమూరు బిడ్డ సీఎం అయితే చూసి ఓర్వలేకపోతున్నాడని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.
హోష్‌లో ఉండి జోష్‌తో పని చేస్తా
అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ పెంపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆడబిడ్డల కోసం రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించామని, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీన ప్రారంభించబోతున్నామని సీఎం ప్రకటించారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, 30 వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు 11 వేల పైచిలుకు ఉద్యోగాలకు డీఎస్సీ నోటిఫికేషన్, 565 ఉద్యోగాల కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేశామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదంతా తమ పనితీరుకు నిదర్శనమన్నారు. తాను తాగుబోతు తిరుగుబోతును కాదని ఎప్పుడూ హోష్‌లో ఉండి జోష్‌తో పని చేస్తానని తెలిపారు. కొడుకును సీఎం చేద్దామనుకుంటే పాలమూరు పిలగాడు వచ్చిండని కేసీఆర్‌కు జలసీ వచ్చిందని విమర్శించారు. హరీశ్ తన మామకు ఒంట్లో మంచిగ లేక అసెంబ్లీకి రాలేదని చెప్పిండని, మరి అలాంటోడు నల్గొండకు గాడ్దులను కాయడానికి పోయారా? అని విమర్శించారు.
పాలమూరుకు ప్రత్యేక ప్రణాళిక
‘నల్లమల బిడ్డనైన నన్ను 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా, 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, 2009, 2014, 2023లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గుండెల్లో పెట్టుకుని గెలిపించుకున్న పాలమూరు ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది’ అని సీఎం వెల్లడించారు. ప్రజలు విశ్వాసంతో తమను గెలిపించారని, వారి నమ్మకం వమ్ముకాకుండా తనతోపాటు మంత్రులు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 14 స్థానాలు గెలవడం ఖాయమ చెప్పారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి
ఇటీవల కోస్గిలో జరిగిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించినట్లుగానే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి పేరును సీఎం ప్రకటించారు. జీవన్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. ఎంపీటీసీ, జడ్పీటీసీల హక్కులతోపాటు, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలను కూడా ఇప్పించేందుకు పనిచేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుస్థిరంగా పరిపాలన అందిస్తుంటే.. కేసీఆర్ తన ఉనికిని కాపాడుకోడానికి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకున్నారని, బీఆర్‌ఎస్, బీఎస్పీ, బీజేపీ.. మూడు బీలు కలిసినా కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ...ఒక మాదిగ బిడ్డ డిప్యూటీ సీఎం అయితే మూడు నెలల్లోనే తొలగించారని, ఆ తర్వాత మాదిగలకు క్యాబినెట్‌లో స్థానమే ఇవ్వలేదన్నారు.
భారీగా హాజరైన జనం
మహబూబ్‌నగర్, మార్చి 6: పాలమూరులో నిర్వహించిన ప్రజాదీవెన సభ సక్సెస్ అయింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారి మహబూబ్‌నగర్‌కు వస్తుండటంతో జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యనేతలు అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. ఎంవీఎస్ కళాశాల మైదానం జనంతో కిటకిటలాడింది. దాదాపు 50 వేల మంది వరకు తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచే మైదానానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు కూడా వస్తూనే ఉన్నారు. మైదానం వెలుపల కూడా భారీ సంఖ్యలో ప్రజలు కనిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు.
Updated Date - Mar 07 , 2024 | 07:10 AM