ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరు గ్యారంటీలకు పెద్దపీట..

ABN, First Publish Date - 2024-02-11T01:09:10+05:30

ఆరు గ్యారంటీ పథకాల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ప్రత్యేకించి ఆరు గ్యారంటీల పేరిట కేటాయింపులు చేసింది. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక పద్దులను కేటాయించింది.

- గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక పద్దు

- ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు

- తెలంగాణ స్కూళ్లకు బడ్జెట్‌ కేటాయింపులు

- రాష్ట్ర ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆరు గ్యారంటీ పథకాల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ప్రత్యేకించి ఆరు గ్యారంటీల పేరిట కేటాయింపులు చేసింది. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక పద్దులను కేటాయించింది. రైతుబంఽధు పథకాన్ని సమీక్షించి వచ్చే సీజన్‌ నుంచి ఎకరానికి 15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని, 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీని వర్తింపజేస్తామని, పంటల బీమాను అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించడం రైతులకు భరోసా ఇచ్చినట్లయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడంతో బడుగుబలహీన వర్గాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత సొంతింటి కల నెరవేరనున్నది. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2,75,891 కోట్ల రూపాయలతో ఓటు ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకాలు ప్రజలను ఆకర్శించే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని, వంట గ్యాస్‌ను 500 రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి 15 వేలు, కౌలు రైతులకు 15 వేలు, కూలీలకు 12 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. చేయూత కింద ఇప్పుడు ఇస్తున్న పింఛన్లను డబుల్‌ చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. యువ వికాసం ద్వారా విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు సాయం అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వైద్య సేవలను అమల్లోకి తీసుకవచ్చారు. త్వరలో గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించేందుకు, 500 రూపాయలకే వంట గ్యాస్‌ ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ఈ పథకాలను అమలు చేసేందుకు బడ్జెట్‌లో 53,196 వేల కోట్లు, గృహజ్యోతి కోసం 2,418 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం 7,740 కోట్లు కేటాయించారు. ప్రతి నియోజకెవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో జిల్లాకు 9 వేల వరకు ఇళ్లు కేటాయించే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల భవనాల నిర్మాణాల కోసం ఎస్సీ, ఎస్టీ భవనాల కోసం 1250 కోట్లు, బీసీ భవనాల కోసం 1546 కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమానికే కేటాయించిన బడ్టెట్‌ నుంచే భవనాలను నిర్మాణాలను చేపట్టనున్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్‌కంటే తక్కువగా 8 వేల కోట్లు మాత్రమే కేటాయించడంతో బీసీ వర్గాలు నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. జిల్లాకు ప్రత్యేకించి బడ్జెట్‌ కేటాయింపులు లేనప్పటికీ, ఆయా శాఖల ద్వారా కేటాయించిన నిధులతోనే జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశాలున్నాయి. ఇది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కావడంతో పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తున్నది. రాష్ట్ర బడ్జెట్‌పై వివిధ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

ఫ ఆరు గ్యారంటీల అమలుపై భరోసానిచ్చే బడ్జెట్‌..

- సీహెచ్‌ విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే

అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆరు గ్యారంటీ పథకాల అమలుపై ప్రజలకు భరోసా ఇచ్చినట్లయ్యింది. ఇంతకు ముందేప్పుడు ఇలాంటి బడ్టెట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఆడంబరాలకు వెళ్లకుండా అన్ని రంగాలకు పెద్దపీట వేసే విధంగా, అన్ని వర్గాల ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్‌ ఉంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత న్యాయం జరగనున్నది. గురుకుల విద్యాలయాలకు శాశ్వతంగా భవనాలు నిర్మించేలా బడ్జెట్‌ కేటాయించడం హర్షణీయం. రైతుబంధు, రుణ మాఫీపై ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఫ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌..

- రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, రామగుండం ఎమ్మెల్యే

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉంది. ఆరుగ్యారంటీ పథకాలను అమలుచేసే దిశగా, బడుగు, బలహీన వర్గాల ప్రజలను, రైతులను ఆదుకునే విధంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే విధంగా బడ్జెట్‌ ఉంది. విద్య, వైద్యానికి, గ్రామీభివృద్ధి, పట్టణాభివృద్ధికి, గృహజ్యోతి అమలుకు ఎక్కువ కేటాయింపులు జరిపారు. ఇది అందరు మెచ్చే బడ్జెట్‌.

ఫ సంపూర్ణంగా నిధుల కేటాయింపుల్లేవు..

- పుట్ట మధూకర్‌, జడ్పీ చైర్మన్‌

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్నికల సమయంలో వారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీములకు సరిపడా నిధులను కేటాయించలేదు. బడ్జెట్‌లో పొందుపరిచిన అంశాలను చూస్తే వారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతుబంధు, రుణమాఫీపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. వారి ఇష్టానుసారంగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగింది.

ఫ రైతులకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

- కోరుకంటి చందర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ రైతులకు భరోసానిచ్చే విధంగా లేదు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్‌ 19,746 కోట్లు కాగా, ఈ బడ్జెట్‌తో రైతులకు 2 లక్షల రుణ మాఫీ, ఏడాదికి రూ.15 వేల రైతుబంధు, పంటల బీమా, వరికి బోనస్‌ ఏ విధంగా ఇస్తారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితులు కనబడడం లేదు. బీసీ సంక్షేమానికి తక్కువ మొత్తంలో బడ్జెట్‌ కేటాయించారు. నీటి పారుదల రంగానికి కూడా తక్కువ కేటాయింపులు చేశారు. ప్రజలకు ఆమోద యోగ్యంగా లేదు ఈ బడ్జెట్‌.

ఫ ప్రజలను మభ్యపెట్టడానికే ఎన్నికల బడ్జెట్‌

- చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికి అసెంబ్లీలో ఆచరణకు సాధ్యం కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తున్నది. గత సంవత్సరం రాష్ట్ర ఆదాయం 1.6 కోట్లు ఉంటే, 2.75లక్షల కోట్లతో బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. లక్ష కోట్ల డిఫరెంట్‌ బడ్జెట్‌లో కనిపిస్తుంది. వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఎలా పూడ్చుతారో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలను తామే అమలు చేస్తున్నట్లు బడ్జెట్‌లో చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్‌ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫ కార్మిక లోకాన్ని విస్మరించారు..

- ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రాష్ట్రంలోని కార్మిక లోకాన్ని విస్మరించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విధంగా వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాల పెంపుదలకు ప్రతిపాదనలు లేవు, నిధులు కేటాయించలేదు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మనెంట్‌ ఊసే లేదు. రాష్ట్రంలో కోటిన్నర మంది కార్మికులను విస్మరించే విధంగా బడ్జెట్‌ ఉండడం నిరాశకు గురిచేస్తున్నది.

ఫ బీసీలకు మొండి చెయ్యి..

- ఆకుల స్వామి వివేక్‌ పటేల్‌, బీసీ జాతీయ సంఘం నాయకులు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు మొండి చెయ్యి చూపారు. ఎస్సీ, ఎస్టీల కంటే కేవలం 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో 56 శాతం మంది బీసీల జనాభా ఉంటే తక్కువ మొత్తంలో బడ్జెట్‌ పెట్టడం అన్యాయానికి గురి చేసినట్లయ్యింది. ఎన్నికల సంధర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ సబ్‌ప్లాన్‌ తీసుకవస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నెరవేరేలా బడ్జెట్‌ను చూస్తే కనబడడం లేదు.

Updated Date - 2024-02-11T01:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising