Jaggareddy : కేసీఆర్ పాపాలు కడగాలంటే బ్యారెళ్ల ఫినాయిల్ కావాలి
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:15 AM
ధరణిలో లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని.. ఇందులో అవకతవకలన్నీ బయటికి రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలు, లోపాలు కడగాలంటే లీటర్, రెండు లీటర్ల ఫినాయిల్ సరిపోదని, బ్యారెళ్లకు బ్యారెళ్ల ఫినాయిల్ పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా మొత్తం
ఒక్కొక్కటిగా ధరణి లోపాలు అవకతవకలన్నీ బయటికి రావాలి
అధికారం ఇస్తేనే కేసీఆర్ సభకు వస్తడా?: జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ధరణిలో లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని.. ఇందులో అవకతవకలన్నీ బయటికి రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలు, లోపాలు కడగాలంటే లీటర్, రెండు లీటర్ల ఫినాయిల్ సరిపోదని, బ్యారెళ్లకు బ్యారెళ్ల ఫినాయిల్ పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఫినాయిల్ కొనడానికే పోయేట్టుందని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టు సాయికుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతంలతో కలిసి ఆయన మాట్లాడారు. ధరణి సమస్యలపైన అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఎంత చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఏమీ పట్టించుకోలేదని ఆరోపించారు. ధరణి సమస్యలపైన కోదండరెడ్డి తిరుగుతూ ఉండేవారని, ఫార్మా సిటీ భూముల సమస్యలపైనా కొట్లాడారని చెప్పారు. రైతులకు మేలు జరగనప్పుడు ధరణి ఎందుకని చెప్పి దాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. కాగా.. కేటీఆర్ మంత్రిగా పనిచేసిన శాఖల్లో జరిగిన అవినీతికి కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తొమ్మిదేళ్ల తర్వాత మూడున్నర గంటల పాటు ఏకధాటిగా ఒక అంశంపైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడంగ చూడలేదని, కానీ అది ఇవాళ కనిపించిందన్నారు. ‘‘బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. శాసనసభలో ప్రతిపక్షం నోరు నొక్కేవారు. సభ నుంచి పో.. పొమ్మనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను.. సభకు రా.. రా అని సీఎం రేవంత్‌రెడ్డి అడిగే పరిస్థితి వచ్చింది’’ అన్నారు. సభా మర్యాదలు పాటించని పార్టీ బీఆర్‌ఎస్ అయితే.. పాటించే సీఎం.. రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘అధికారం ఇస్తే సభకు వస్తవు.. ఇవ్వక పోతే రావా?’’ అంటూ కేసీఆర్‌ను నిలదీశారు.
ఆ అంశాలపైనా విచారణ జరగాలి: కోదండరెడ్డి
ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఎక్కడా అని ఓ మాజీ మంత్రి అడుగుతున్నారని, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా అమ్ముకుంటుంటే అప్పటి సివిల్ సప్లయ్స్ మంత్రి ఏం చేశారని కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. ఇది పెద్ద కుంభకోణమని, దీనికి ఆ మాజీ మంత్రే బాధ్యత వహించాలన్నారు. ధరణి లోపాలూ పెద్ద కుంభకోణమన్నారు. రెవెన్యూ శాఖనూ నిర్వహించిన కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శివబాలకృష్ణ వ్యవహారంపై కేటీఆర్ బాధ్యత అని, ఈ మూడు అంశాలపైనా సమగ్ర విచారణ జరగాలని ఆయన అన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 04:15 AM