ఆగని అసమ్మతి రగడ
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:42 AM
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు. మరో రెండు మున్సిపాలిటీల్లో సొంత పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసును అందజేశారు.
మరో రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాస పర్వం
సంగారెడ్డి, తూప్రాన్‌లో నోటీసులు అందజేసిన సభ్యులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 12: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు. మరో రెండు మున్సిపాలిటీల్లో సొంత పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసును అందజేశారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మిపై కౌన్సిలర్లు అసమ్మతి తీర్మానం చేస్తూ అధికారులకు నోటీసులు అందజేశారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన చైర్‌పర్సన్‌పై సొంత పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లతో పాటు బీజేపి, కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. 24 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీసును సోమవారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు అందజేశారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన 18 మంది, కాంగ్రె్‌సకు చెందిన నలుగురు, బీజేపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా, ఒక కౌన్సిలర్ మరణించడంతో ప్రస్తుతం 37 మంది సభ్యులున్నారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గాలంటే 20 మంది కౌన్సిలర్ల సంతకాలు అవసరం ఉండగా 24 మంది సంతకాలు చేశారు. కొత్త చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు 26 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరముంటుంది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన వారిలో బీఆర్‌ఎ్‌సకు చెందిన వైస్ చైర్‌పర్సన్ లతావిజయేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు నక్క మంజులతా నాగరాజుగౌడ్, మాణెమ్మ, పద్మ, లావణ్య, లాడే వనీలా, స్రవంతి, అంజుమ్, జీవీ వీణాశ్రీనివాస్, కొత్తపల్లి శ్రీకాంత్, అశ్విన్‌కుమార్, షేక్ సాబేర్, పవన్‌నాయక్, శ్రీకాంత్, విష్ణు, ఎండీ సమీ, రామప్ప, దిడ్డి విజయలక్ష్మి, కాంగ్రెస్‌కు చెందిన బోయిని విజయలక్ష్మి, చాకలి స్వప్న, వెంకట్‌రాజ్, మాధురి, బీజేపీకి చెందిన కసిని రజని, మందుల రాధాకృష్ణ ఉన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌పై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారని ధ్రువీకరించారు. నెల రోజుల్లో కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించి నిబంధనల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు.
తూప్రాన్‌లో కౌన్సిలర్ల తిరుగుబాటు
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 12: తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్‌గౌడ్‌పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడుతున్నారని, కౌన్సిలర్లను విభజించి పాలిస్తున్నారని, అభివృద్ది పేరుతో కోట్ల రూపాయాల కుంభకోణం చేస్తున్నారని, ఏ అనుమతులు కావాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే బెదరింపులు, భౌతిక దాడులు చేయిస్తున్నాడని ఆరోపిస్తూ.. 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. వారంతా సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి అవిశ్వాస తీర్మానం కాపీని అందజేశారు. ఈమేరకు నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారని కౌన్సిలర్లు వివరించారు. మున్సిపాలిటీలో మొత్తం 16 సభ్యులు ఉండగా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్క కౌన్సిలర్లు గెలిచారు. కానీ, ఇటీవల ఎనిమిది మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 10కి పెరిగింది. బీజేపీ సభ్యుడితో కలిసి వారు అవిశ్వాస తీర్మానం అందజేశారు. తూప్రాన్ మున్సిపల్ పాలకవర్గం ఎన్నికైన కొద్ది రోజుల నుంచే చైర్మన్‌కు సభ్యులతో పొసగడం లేదు. చైర్మన్‌పై పలు ఆరోపణలు చేస్తూ అప్పటి జిల్లా మంత్రి హరీశ్‌రావుకు కౌన్సిలర్లు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్‌ఎ్‌సను వీడడమే కాకుండా అవిశ్వాస తీర్మానం అందజేశారు. చైర్మన్ పదవిపై ప్రస్తుత వైస్‌చైర్మన్ నందాల శ్రీనివా్‌సతోపాటు నాలుగో వార్డు కౌన్సిలర్ మామిండ్ల జ్యోతి, ఐదో వార్డు కౌన్సిలర్ ప్రియాంక ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుతున్నది. అవిశ్వాసంపై తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ స్పందిస్తూ ఎలాంటి అవకతవకలు జరగలేదని, సర్కార్ మారిందని అవిశ్వాసానికి తెరలేపారని ఆరోపించారు.
Updated Date - Feb 13 , 2024 | 12:42 AM