Medigadda Barrage : మరీ ఇన్ని పగుళ్లా?
ABN, Publish Date - Feb 14 , 2024 | 03:52 AM
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో పగుళ్లను చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, వారి వెంట పర్యటనకు వచ్చిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు. ‘‘ఇలాంటి ప్రాజెక్టు గురించా కేసీఆర్, బీఆర్‌ఎస్ లీడర్లు అంత గొప్పగా చెప్పింది? ఈ ప్రాజెక్టు గురించా.. డిస్కవరీ వంటి ..
ఇంత డ్యామేజీ జరిగితే చిన్న లోపమంటారా?..
పగుళ్ల ప్రాజెక్టు గురించా అంత గొప్పగా చెప్పింది!
మేడిగడ్డను చూసి విస్తుపోయిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్/వరంగల్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో పగుళ్లను చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, వారి వెంట పర్యటనకు వచ్చిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు. ‘‘ఇలాంటి ప్రాజెక్టు గురించా కేసీఆర్, బీఆర్‌ఎస్ లీడర్లు అంత గొప్పగా చెప్పింది? ఈ ప్రాజెక్టు గురించా.. డిస్కవరీ వంటి చానళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది? ఈ ప్రాజెక్టేనా.. తెలంగాణకు లైఫ్‌లైన్ అని బీఆర్‌ఎస్ చెప్పుకొన్నది’’ అంటూ ఆశ్చర్యపోయారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మినహా.. మిగతా పార్టీల శాసనసభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ బృందం మధ్యాహ్నం 3.30 గంటలకు మేడిగడ్డను చేరుకోగా.. నేరుగా బ్యారేజీ ఎనిమిదో బ్లాక్ పక్క నుంచి అప్రోచ్‌రోడ్డు ద్వారా గోదావరి నదిలోకి దిగారు. బ్యారేజీ ఫౌండేషన్ వద్ద దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పిల్లర్లను పరిశీలించారు. మొదట కుంగిపోయిన 20వ పిల్లర్‌ను, నిలువునా చీలిన 21వ, నిలువునా పగుళ్లు వచ్చిన 22వ పిల్లర్లను పరిశీలించారు. 18వ పిల్లర్ ఫౌండేషన్ నుంచి నీళ్లు ఉబికి వస్తుండడాన్ని చూసి, ఆశ్చర్యపోయారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్‌ను తొలగించకపోవడంపై.. పైన అప్రోచ్ బ్రిడ్జి వరకు ఏర్పడిన భారీ పగుళ్లను చూసి ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేశారు. బ్యారేజీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఏకంగా ఐదు అడుగుల మేర కుంగిపోవడం, 20వ పిల్లర్ ఎడమ వైపునకు కొద్దిగా వంగిపోవడంతో.. అసలు బ్యారేజీ నిలిచి ఉండే అవకాశం ఉందా? వరద వస్తే కొట్టుకుపోతుందా? అని ఇంజనీర్లను ప్రశ్నించారు. బ్యారేజీకి ఇంత నష్టం జరిగితే.. నాలుగైదు పిల్లర్లను తిరిగి కడితే సరిపోతుందని బుకాయించడాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఇంత పెద్ద పిల్లర్లను ఎలా తొలగిస్తారని, కొత్తగా ఎలా కడతారని ఇంజనీర్లను ప్రశ్నించారు. దానికి ఇంజనీర్లు స్పందిస్తూ.. డైమండ్ కటింగ్ ద్వారా బ్యారేజీలోని మిగతా భాగాలకు నష్టం జరుగకుండా పిల్లర్లను తొలగించి మళ్లీ నిర్మిస్తామని వివరించారు. మీడియా ప్రతినిధులు కూడా బ్యారేజీ పగుళ్లను దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి.
పనులు పూర్తవ్వకుండానే ప్రారంభం
మేడిగడ్డ పనులు పూర్తి కాకుండానే.. 2019 జూన్ 21 అప్పటి సీఎం కేసీఆర్ బ్యారేజీని ప్రారంభించారని, నిజానికి అప్పటికి బ్యారేజీ ముందు భాగంలో లాంచింగ్ అప్రాన్ పనులు జరుగుతున్నాయని విజిలెన్స్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పనులు కాకున్నా.. అయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. లోపాలకు బాధ్యత వహించే సమయం మిగిలి ఉండగానే.. నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారెంటీని విడుదల చేశారని పేర్కొన్నారు. దీంతో.. నిపుణుల కమిటీ తేల్చాకే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మరమ్మతు చేయాలా? పునరుద్ధరణ చేయాలా? లేక వాటి స్థానంలో కొత్తవి కట్టాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బ్లాక్ లిస్ట్‌లో ఎల్‌అండ్‌టీ?
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ఎల్‌అండ్‌టీ ముందుకు రాకపోతే ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టే ప్రతిపాదనలు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. నిర్మాణ పనులకు సంబంధించి ఎల్‌అండ్‌టీకి రూ.695 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మేడిగడ్డను ప్రారంభించిన ఐదు నెలలకే లోపాలు బయట పడ్డాయని తాజాగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మాణ సంస్థే బాధ్యత వహించాలనే అభిప్రాయానికి వచ్చింది. బ్యారేజీ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ముందుకురాకుంటే.. పెండింగ్ బిల్లుల విడుదలను అడ్డుకోవడమే కాకుండా.. ఎల్‌అండ్‌టీని బ్లాక్ లిస్టులో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్కారు సంకల్పించింది.
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటనలో లోపాలను పరిశీలిస్తూ.. అధికారులను ప్రశ్నిస్తూ.. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకు సాగారు. బ్యారేజీపైన ఏడో బ్లాకు వద్ద.. ఎంత మేర కుంగిందని ఇంజనీర్లను అడిగి, తెలుసుకున్నారు. తన వెంట ఉన్న మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలకు పగుళ్ల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ప్రాణహిత నది నుంచి వచ్చే నీటికి మేడిగడ్డ వద్ద అడ్డుకట్ట వేసి.. ఇక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎల్లంపల్లికి ఏ విధంగా నీటిని పంపింగ్ చేస్తారో ఎమ్మెల్యేలకు వివరించారు. అనంతరం నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరు సుధాకర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరించారు. రేవంత్‌రెడ్డి మధ్యలో కల్పించుకుంటూ.. ప్రాజెక్టు వ్యయం, ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది? అనే అంశాలపై ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా రూ.25 వేల కోట్ల నిర్వహణ ఖర్చులతో 19.6 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చీఫ్ ఇంజనీరు వివరించారు. ఇంతమొత్తంలో ఖర్చుచేసి, 19.60 లక్షల ఎకరాలకే నీరందిస్తే.. ప్రయోజనం ఏమిటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని తమ ప్రచారానికి బీఆర్‌ఎస్ వాడుకుని, ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. 2020-23 మధ్యకాలంలో నాలుగు సార్లు ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీలో లోపాలను ఎత్తిచూపినా, ఎల్‌అండ్‌టీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
దేశంలోనే భారీ స్కామ్: ఉత్తమ్
స్వాతంత్ర్యానంతరం దేశంలో జరిగిన కుంభకోణాల్లో కాళేశ్వరం భారీ స్కామ్ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రూ.38వేల కోట్ల ప్రాజెక్టుకు రీడిజైనింగ్ పేరుతో రూ.94 వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ‘‘ప్రాజెక్టు కోసం ఇంకా రూ.34 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ప్రాజెక్టును కట్టారు. ఇది భారీ కుంభకోణం. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా క్యాబినెట్‌లో చర్చిస్తాం. అక్టోబరు 21న మేడిగడ్డ కుంగితే.. కేసీఆర్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కాళేశ్వరం ఫెల్యూర్ ప్రాజెక్టు అని తేల్చారని.. వారి సూచనలతోనే ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్తామన్నారు.
ప్రజల గుండెకు పగుళ్లు: కూనంనేని
కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా చూడటం బాఽధాకరంగా ఉందని, ఇవి మేడిగడ్డ పగుళ్లు కాదని, తెలంగాణ ప్రజల గుండెకు ఏర్పడిన పగుళ్లని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మూడేళ్లలో నిర్మించడం, ఎనిమిదేళ్లలో కూలిపోవడం ప్రాజెక్టులో డిజైన్ లోపమేనని ఆరోపించారు. మోతాదుకు మించి నీటిని నిల్వ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. నాణ్యతాలోపంతో ప్రాజెక్టును నిర్మించి, లక్ష కోట్లను గోదారిలో పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - Feb 14 , 2024 | 03:52 AM