హరిహరులకు విశేష పూజలు
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:24 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కొండగుహలో కొలువైన లక్ష్మీనృసింహుడికి, శివాలయంలో రామలింగేశ్వరుడికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 12: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కొండగుహలో కొలువైన లక్ష్మీనృసింహుడికి, శివాలయంలో రామలింగేశ్వరుడికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. సుప్రభాతంతో లక్ష్మీనృసింహుడిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని మూలమూర్తులకు, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులను వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరు కల్యాణోత్సవాలు శాసో్త్రక్తంగా నిర్వహించారు. కొండపైన శివాలయంలో పర్వత వర్థినీ సమేత రామలిగేశ్వరుడిని, ముఖమండపంలోని స్పటిక మూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం వేళ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల అలంకార వెండి జోడు సేవలు, శివాలయంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను పట్టువసా్త్రలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధుల్లో సేవోత్సవం నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.27,78,618 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
16న రథసప్తమి వేడుకలు
ఏకశిఖరవాసుడు కొలువైన యాదగిరిక్షేత్రంలో ఈ నెల 16వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించనున్నట్టు దేవస్థాన ఈవో రామకృష్ణారావు సోమవారం ప్రకటనలో తెలిపారు. లక్ష్మీనృసింహుడిని సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేసి ఉదయం 6.40గంటలకు తిరువీఽధుల్లో ఊరేగింపు నిర్వహించి, ప్రధానాలయ తూర్పు పంచతల రాజగోపురం ముందు అర్చకబృందం, వేదపండితులు చతుర్వేద పారాయణం చేసి రధసప్తమి విశిష్టతను వివరిస్తారని, సాయంత్రం 7గంటలకు స్వర్ణతాపడ దివ్యవిమాన రథంపై తీర్చిదిద్ది తిరువీఽధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:24 AM