కూలిన పురాతన భవనం బాల్కనీ
ABN, First Publish Date - 2024-02-10T23:57:13+05:30
పురాతన భవనం బాల్కనీ కూలిన ఘటనలో ద్విచక్రవాహనాలు దెబ్బతినగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో శనివారం జాతీయ రహదారి పక్కన గల గణేష్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి పక్కన దాదాపు 40 ఏళ్ల క్రితం గణేష్ కాంప్లెక్స్ నిర్మించారు.
పెచ్చులూడి కిందపడటంతో దెబ్బతిన్న 12 ద్విచక్రవాహనాలు
తప్పిన పెను ప్రమాదం.. ఫ శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఘటన
శంషాబాద్, ఫిబ్రవరి 10 : పురాతన భవనం బాల్కనీ కూలిన ఘటనలో ద్విచక్రవాహనాలు దెబ్బతినగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో శనివారం జాతీయ రహదారి పక్కన గల గణేష్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి పక్కన దాదాపు 40 ఏళ్ల క్రితం గణేష్ కాంప్లెక్స్ నిర్మించారు. 20 దుకాణాలతో పాటు పైన ఉన్న మూడు అంతస్తుల్లో 20 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ కాంప్లెక్స్‌కు చెందిన యజమానులు బిల్డింగ్ మెయింటెనెన్స్ సరిగ్గా చేపట్టకపోవడంతో పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే బిల్డిండ్‌లో ఏర్పడిన పగుళ్ల నుంచి పెచ్చులు ఊడిపోయి కిందపడుతుంటాయని అందులో నివాసముండేవారు తెలిపారు. కాగా, కాంప్లెక్స్‌లో కుడివైపున ఉన్న ఓ షాపు యజమాని రెండు రోజుల క్రితం బోరు బోరు వేయించారు. ఆ సమయంలో వచ్చిన ప్రకంపనలతో భవనంలో పగుళ్లు ఎక్కువయ్యాయి. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో భవనం ఎడమవైపు బాల్కనీతో పాటు కొంతభాగం గోడ పెచ్చులూడి కిందపడ్డాయి. దాంతో కింద ఉన్నటువంటి హీరోహోండా షోరూం ఎదుట పార్కుచేసిన 12 ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ.పది లక్షల ఆస్తినష్టం జరిగిందని ఆ షోరూంలో పనిచేసే రమేష్ అనే కార్మికుడు తెలిపాడు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భవన యజమానులకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కాగా, బాల్కనీ కూలిన సమయంలో పెద్ద శబ్ధంతో శిథిలాలు కిందపడటంలో ఉలిక్కిపడ్డామని, ఒక్కసారిగా దుమ్ము కమ్ముకోవడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియలేదని కాంప్లెక్స్‌లో నివాసముంటున్న రాజు, విజయ్‌లతో పాటు దుకాణ యజమానులు తెలిపారు. కాగా, గణేష్ కాంప్లెక్స్‌లోని ఓ దుకాణ యజమాని బోరు వేయించినందుకే భవనం పగుళ్లు ఎక్కువై కూలిపోవడానికి కారణమైందని అందులో నివాసముంటున్న వారు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2024-02-10T23:57:14+05:30 IST