TG Beer War : బీర్.. వార్!
ABN, Publish Date - May 28 , 2024 | 06:23 AM
కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి వారం రోజులు కూడా కాలేదు! ఈ మధ్య కాలంలో మంత్రివర్గమూ సమావేశం కాలేదు. కానీ, తమ కంపెనీకి చెందిన ప్రముఖ
రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపై పంచాయితీ
మా బ్రాండ్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజికి సోం డిస్టిలరీస్ లేఖ
దాంతో కొత్త బ్రాండ్ల రాకపై విస్తృత ప్రచారం
కానీ, కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు
చేసుకోలేదని వారం కింద చెప్పిన మంత్రి జూపల్లి
మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య
మంత్రి వ్యాఖ్యల్ని తప్పుబట్టిన బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్
ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారా అని ప్రశ్న
‘మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకూ ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు’
- ఈ నెల 21న గాంధీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
‘మా కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం మాకు అధికారికంగా అనుమతి ఇచ్చింది’
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ), బీఎస్‌ఈకు సోమవారం రాసిన లేఖలో మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్.
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి వారం రోజులు కూడా కాలేదు! ఈ మధ్య కాలంలో మంత్రివర్గమూ సమావేశం కాలేదు. కానీ, తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం తమకు అధికారికంగా అనుమతి ఇచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజికి మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్ సమాచారం ఇచ్చింది. బీర్ వినియోగంలో భారతదేశంలో అతి పెద్ద మార్కెట్లలో తెలంగాణ ఒకటని గుర్తింపు పొందిందని, దాంతో, తమ విక్రయాలను పెంచుకోవడానికి, కంపెనీ విస్తరణకు గణనీయ అవకాశం వచ్చిందని ఆ లేఖలో పేర్కొంది. మార్కెట్‌ను పెంచుకోవాలనుకుంటున్న తమకు తెలంగాణ సర్కారు నుంచి అనుమతి రావడం కీలక అడుగు అని, తద్వారా, ఈ ప్రాంతంలో బీరు డిమాండ్‌కు అనుగుణంగా తాము సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. తాజా అనుమతితో.. రాబోయే కొద్ది రోజుల్లోనే తమ సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ అనుమతిని ఎప్పుడు ఇచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ లేఖలో పేర్కొనలేదు. దాంతో, తెలంగాణలోకి బీర్ కొత్త బ్రాండ్లు రానున్నాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పవర్ 10000; బ్లాక్ ఫోర్ట్; హంటర్ స్ట్రాంగ్; వుడ్ పెకర్; హంటర్ బ్రాండ్ బీర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, గత రెండు నెలలుగా రాష్ట్రంలో బీర్లకు కొరత ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలోనూ కొన్ని ప్రముఖ బీరు బ్రాండ్లు రాష్ట్రంలో దొరకలేదనే కథనాలూ ప్రచురితం అయ్యాయి. అయితే, గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, తాము ఒక్కొక్కటిగా వాటిని చెల్లిస్తున్నామని, ఇంకా కొన్ని బకాయిలు పెండింగులో ఉన్నాయని, అందుకే బీర్ల షార్టేజీ వచ్చిందని విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పాలసీల్లో మార్పు ఏదైనా ఉంటే క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కానీ, కొత్త బీరు బ్రాండ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే కొంత కాలంగా ప్రముఖ బ్రాండ్ల సరఫరా నిలిపివేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని సరఫరా చేసేందుకు కొత్తగా సోం డిస్టిలరీస్ కంపెనీని తీసుకు వస్తున్నారని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్దం చెబుతున్నారని, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే తెలంగాణలో బీర్లు అమ్మేందుకు సోం డిస్టిలరీస్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి.. అనుమతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. సోం డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణకు వస్తున్న విషయం అసలు మంత్రి జూపల్లికి తెలుసా? అని నిలదీశారు. ఆ కంపెనీ మద్యం కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారని, దాంతో, అక్కడ ఈ సంస్థను సీజ్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ బ్రాండ్లను తెలంగాణలో ప్రవేశపెట్టి ఇక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తారా? అని నిలదీశారు. సోం డిస్టిలరీస్ ద్వారా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని గతంలో కేసు నడిచిందని, ఆ కంపెనీ 2019లో కాంగ్రెస్ పార్టీకి రూ.1.31 కోట్లు విరాళాలు ఇచ్చిందని తెలిపారు.
Updated Date - May 28 , 2024 | 06:23 AM