నిర్మించారు.. వదిలేశారు..
ABN, Publish Date - Feb 15 , 2024 | 11:26 PM
పల్లె సీమలు దేశానికి పట్టుకొమ్మలు అన్న జాతిపిత మహాత్మాగాంధీ అన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా.. పల్లెలు స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. ఆశయం ఘనం..ఆచరణ శూన్యం అన్న చందంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. కనీసం కొత్త ప్రభుత్వమైన సెగ్రిగేషన్ షెడ్లు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పలువురు ఆశిస్తున్నారు.
ఆశయం ఘనం.. ఆచరణ శూన్యం
నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
నీరుగారుతున్న లక్ష్యం..కొత్త ప్రభుత్వంపై ఆశలు
రఘునాథపల్లి, ఫిబ్రవరి 15: పల్లె సీమలు దేశానికి పట్టుకొమ్మలు అన్న జాతిపిత మహాత్మాగాంధీ అన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా.. పల్లెలు స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. ఆశయం ఘనం..ఆచరణ శూన్యం అన్న చందంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. కనీసం కొత్త ప్రభుత్వమైన సెగ్రిగేషన్ షెడ్లు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పలువురు ఆశిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో భాగంగా గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టి గ్రామ పంచాయతీల ఆదాయం పెంపొందిం చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామాల్లోని చెత్తను సేకరించి తడి,పొడి చెత్తను వేరు వేరుగా చేసి కంపోస్టు ఎరువులను తయారు చేయాలని సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. జిల్లాలోని 281 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కొక్క గ్రామానికి రూ.2.50 లక్షల చొప్పున గత ప్రభుత్వం నిధులు కేటా యించింది. గ్రామాలలో తడి, పొడి చెత్తను సేకరించి విడి విడిగా వేయడానికి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు ఆచరణకు ఆమడ దూరంలో ఉండడంతో అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. గ్రామాల్లో సేకరించిన చెత్త్తను డంపింగ్ యార్డులకు తీసుక వచ్చి తడి, పొడి చెత్తను కలిపి అక్కడే కాల్చివేస్తున్నారు. దీంతో జీపీల ఆదాయం పెంచడానికి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లను జీపీ సిబ్బంది వినియోగించక పోవడం..అధికారుల పర్యవేక్షణ లోపంతోనేనని... జిల్లాలో సర్వాత్రా నిరసన వ్యక్తమవుతుంది. దీంతో పంచా యతీల ఆదాయం పెంచడానికి కంపోస్టు ఎరువుల తయారీ కోసం నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మారాయి.
చెత్త సేకరణకు ట్రాక్టర్ల కొనుగోలు
గ్రామాల్లోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేందుకు గత ప్రభుత్వం జీపీలకు ట్రాక్టర్లను సమకూర్చింది. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తలో ఉన్న ప్లాస్టిక్, కాగితాలు, ఖాళీ సీసాల ద్వారా జీపీలకు కొంత వరకు ఆదాయం వస్తుందని ఆశించినా, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నీరుగారిపోయింది.
ఆదాయ మార్గాలు ఇలా..
గ్రామాల్లో సేకరించిన చెత్తలో వచ్చే ప్లాస్టిక్ బాటిళ్లు, ఖాళీ సీసాలు, కాగితాలను వేరు చేసి విక్రయించడంతో వచ్చే ఆదాయన్ని గ్రామ పంచా యతీల ఖాతాకు జమ చేయాలి. ఆహార పదార్థాలు, కూరగాయలు తదితర వ్యర్ధ పదార్థాలతో కంపోస్టు ఎరువులను తయారు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాటిన మొక్కలు, నర్సరీల్లో ఎరువుగా ఉపయోగిం చుకోవచ్చు. మిగిలిన ఎరువులను రైతులకు విక్రయించి వాటి నుంచి వచ్చిన డబ్బులను జీపీ ఖాతాల్లో వేసి గ్రామ అవసరాలకు వినియోగించు కోవాలి. కానీ ఇప్పటీ వరకు షెడ్లలో అలాంటి పనులు ఆచరణకు ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. తడి,పొడి చెత్తను వేరు చేసి సేకరించేలా ప్రజలను చైతన్యపర్చిన అమలులో మాత్రం లక్ష్యం చేరుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకొచ్చి కంపోస్టు ఎరు వులను తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Feb 15 , 2024 | 11:26 PM