వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్ టెక్ సెంటర్
ABN , First Publish Date - 2021-12-17T08:47:15+05:30 IST
వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రముఖ ఐటీ కంపెనీ జెన్‌ప్యాక్ట్ ప్రకటించింది.

- తొలుత 100మంది ఉద్యోగులతో ప్రారంభం..
- సంస్థ సీఈవో టైగర్ త్యాగరాజన్ వెల్లడి
- వరంగల్‌లో ఐటీకి పెద్ద పీట: మంత్రి కేటీఆర్
హైదరాబాద్/సంగారెడ్డి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రముఖ ఐటీ కంపెనీ జెన్‌ప్యాక్ట్ ప్రకటించింది. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు విద్యా శ్రీనివాసన్, సతీశ్ వడ్లమాని, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం సీఈవో టైగర్ త్యాగరాజన్‌తో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఈవో తన నిర్ణయాన్ని ప్రకటించారు. తమ సంస పోచారం క్యాంప్‌సకు వరంగల్ దగ్గరలో ఉందని, గంటన్నరలో చేరుకోవచ్చని చెప్పారు. ఎన్‌ఐటీతో పాటు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో నాణ్యమైన మానవ వనరులు లభిస్తాయని పేర్కొన్నారు. జెన్‌ప్యాక్ట్ టెక్ సెంటర్‌ను తొలుత 100 మంది ఉద్యోగులతో ప్రారంభిస్తామని చెప్పారు. టెక్ సెంటర్ ఏర్పాటుకు వరంగల్‌ను ఎంచుకోవడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ బృందంతో సమావేశంలో వరంగల్‌లో క్యాంపస్ ఏర్పాటు ప్రయోజనాలను మంత్రి ప్రస్తావించారు. హైదరాబాద్‌తో వరంగల్‌కు మంచి కనెక్టివిటీ ఉందని, ఈ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్‌తో వరంగల్‌కు మంచి కనెక్టివిటీ ఉందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఇస్తున్నందుకు సీఈవో త్యాగరాజన్, జెన్‌ప్యాక్ట్ బృందాన్ని ప్రశంసించారు.
500 కోట్లతో మార్స్ పెట్‌కేర్ విస్తరణ
పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ మార్స్ పెట్‌కేర్ వ్యాపార విస్తరణ ప్రణాళికలను గురువారం ప్రకటించింది. రూ.500 కోట్లతో విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఎండీ గణేష్ రమణి ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకూ తమ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఈ ఏడాది 35-40 శాతం వృద్ధి అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలాల్లోని పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. సంగారెడ్డిలో రూ.6.70 కోట్లతో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ భవన సముదాయ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక జీవో నం. 58, 59 తెచ్చి పేదలకు లబ్ధి చేకూర్చామని.. మళ్లీ వాటిని అమలు చేసి పేదల ఇళ్లను క్రమబద్ధీకరించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 142 మునిసిపాలిటీల్లో రూ.500 కోట్లతో ఆధునిక వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి వరకు మెట్రోను పొడిగించడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఓఆర్‌ఆర్‌ను మరిపించేలా ఆర్‌ఆర్‌ఆర్
హైదరాబాద్ నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును మరిపించేలా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను నిర్మిస్తామని, ఇది పటాన్‌చెరు అవతలి వైపు రాబోతుందని తెలిపారు. గురువారం పటాన్‌చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజ్‌లో నాలుగు ప్యాకేజీల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ విద్యుద్దీపాలను జీఎ్‌సఎం బేస్ట్ ఆటోమేషన్ విధానంలో ప్రారంభించారు. ఎల్‌ఈడీ విద్యుద్దీపాల ఏర్పాటుతో ఓఆర్‌ఆర్‌పై వెళ్తుంటే విదేశాల్లో ఉన్నట్లుగా ఉందన్నారు.