Anantapuram: మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులును అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2022-11-16T12:45:57+05:30
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మైనార్టీ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాల్వ శ్రీనివాసులు బొమ్మనహల్ మండలం, ఉంతకల్లుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కల్యాణదుర్గం ఇన్‌చార్జ్ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బొమ్మనహల్, కణేకల్లులో టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కణేకల్ పోలీసుల తీరుతో మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం జిల్లా. బొమ్మనహాల్ మండలం, ఉంతకల్లులో పోలీసులు భారీగా మోహరించారు. కణేకల్లు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపులతో ఓ మైనార్టీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం బళ్లారికి తరలించారు. కాగా... బళ్లారిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతూ తల్లి షేకున్ బీ, కుమారుడు మన్సూర్ భాషా మృతి చెందగా.. తండ్రి సలీం భాషా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ బందోబస్తు నడుమ బళ్లారి నుంచి ఉంతకల్లుకు తల్లి, కుమారుడి మృతదేహాలను తరలించారు. అంత్యక్రియలు త్వరగా నిర్వహించాలంటూ మన్సూర్ భాషా కుటుంబంపై పోలీసులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. కణేకల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి కొట్టడం, బెదిరింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ బంధువులు ఆవేదన చెందుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతుండడంతో పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో గ్రామంలోకి బయట వ్యక్తులు రాకుండా అడ్డుకుంటున్నారు.
Updated Date - 2022-11-16T12:46:03+05:30 IST