ఎత్తిపోతలగా పోలవరం!
ABN, First Publish Date - 2022-11-18T02:56:32+05:30
పోలవరం ప్రాజెక్టును మరో ఎత్తిపోతల పథకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళన బలపడుతోంది.
ప్రాజెక్టు పూర్తయ్యేలోగా
డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోస్తాం
జనవరి నుంచి ఏప్రిల్ దాకా మెట్టకు తాగునీరిస్తాం
జగన్ ప్రభుత్వ ప్రతిపాదన.. జలసంఘానికి డీపీఆర్
2,873 కోట్లూ నీళ్లపాలే.. బిల్లులకు కేంద్రం నో
10 వేల కోట్లడిగితే అసలుకే మోసం తెచ్చిన పీపీఏ
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును మరో ఎత్తిపోతల పథకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళన బలపడుతోంది. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన మెట్ట ప్రాంతాలకు జనవరి-ఏప్రిల్ మధ్య తాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జల సంఘానికి పంపింది కూడా. ప్రాజెక్టు 32 మీటర్ల నుంచి 35.50 మీటర్ల కాంటూరులో డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోస్తామని.. ఇందుకు కుడి, ఎడమ ప్రధాన కాలువలను ఉపయోగించుకుంటామని అంటోంది. ఇప్పటికే కుడి ప్రధాన కాలువ ఆధారంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీదాకా గోదావరి జలాలను తరలిస్తున్నారు. దానిని కొనసాగిస్తే ఇబ్బంది ఉండదు. అయితే ఈ పథకంలో పోలవరం నుంచి కాకుండా గోదావరి నుంచి నేరుగా జలాలను పంపింగ్ చేస్తారు. అంటే.. ఇది పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదు. పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోస్తే.. ప్రాజెక్టులో భాగమని ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని.. అందుకే ఈ వ్యూహం పన్నిందని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే.. 194.60 టీఎంసీల నీటిని రెండు దఫాలుగా 389 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే వీలుంది. పైగా గ్రావిటీ ద్వారా ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా తొలి దశలో విశాఖ దాకా.. మలిదశలో ఇచ్చాపురం దాకా గోదావరి జలాలను తీసుకెళ్లవచ్చు. కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదికి తరలించొచ్చు. ఇదంతా గ్రావిటీతోనే సాధ్యమవుతుంది. కానీ అదనంగా డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన అగత్యం ఏమిటన్న సందేహాలు నెలకొన్నాయి. గోదావరి. కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో జనవరి నుంచి ఏప్రిల్ దాకా తాగునీటికి ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇందుకోసం 32 మీటర్ల నుంచి 35.50 మీటర్ల మేర డెడ్ స్టోరేజీ నుంచి తోడేస్తామని.. ఈ జలాలను ప్రాజెక్టు దారిపొడవునా ఉన్న గ్రామాలకు, ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు సరఫరా చేస్తామని అంటోంది. ఈ పథకంపై కేంద్ర జలశక్తి కార్యదర్శి సానుకూలంగా స్పందించారని బుధవారంనాటి పీపీఏ సమావేశంలో రాష్ట్రప్రభుత్వం ప్రస్తావించింది. డీపీఆర్‌ను జలసంఘం పరిధిలోని కృష్ణా-గోదావరి పరివాహక ప్రాంత చీఫ్ ఇంజనీర్‌కు పంపినట్లు తెలిపింది. వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం ప్రయోజనాలను గతేడాది డిసెంబరు పదో తేదీన పీపీఏకి ప్రభుత్వం వివరించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరందిస్తామని వెల్లడించింది. ఈ డీపీఆర్‌కు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపితేనే ముందుకు కదులుతుంది.
Updated Date - 2022-11-18T02:56:33+05:30 IST