Polavaram project : ‘పోలవరం’పై 8 నుంచి సంయుక్త సర్వే
ABN, First Publish Date - 2022-11-04T05:40:23+05:30
పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై ఈ నెల 8వ తేదీ నుంచి సంయుక్త సర్వే జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ..
తెలంగాణ, ఏపీ అధికారుల బృందం ఆధ్వర్యంలో
35 ఉప నదుల ప్రవాహంపై సర్వే, హద్దుల నిర్ధారణ
హైదరాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై ఈ నెల 8వ తేదీ నుంచి సంయుక్త సర్వే జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారుల బృందం ఈ సర్వే చేపట్టనుంది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో కిన్నెరసాని, ముర్రేడు వాగు ప్రవాహం సజావుగా ఉండదని, దీనివల్ల తమ రాష్ట్రంలోని 891 ఎకరాలు ముంపునకు గురవుతాయని ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో కిన్నెరసాని కలిసే చోట నుంచి 18 కిలోమీటర్లు, ఆ తర్వాత కిన్నెరసానిలో ముర్రేడువాగు కలిసే ప్రదేశం నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని ఎన్జీటీ వేసిన కమిటీ సైతం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కిన్నెరసాని, ముర్రేడువాగుతోపాటు గోదావరిలో కలిసే మొత్తం 35 ఉపనదులపై పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో సర్వే చేసి, హద్దులు నిర్ధారించనున్నారు. ఏయే భూములు ముంపునకు గురవుతున్నాయో తేల్చి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాటిని సేకరించనున్నారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఏటపాక నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది.
ప్రధానంగా తెలంగాణ అభ్యంతరాలు
పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల ద్వాకా నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 891 ఎకరాల సాగు భూమి నీట మునగనుంది. ఈ భూములను 2013 భూసేకరణ చట్టం అనుసరించి... పునరావాసం, పునర్నిర్మాణ ప్యాకేజీని అమలు చేసి, సేకరించాలి.
36 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతో పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై జరిగిన అధ్యయనంలో లోపాలున్నాయి. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా సంయుక్త(తెలంగాణ, ఏపీ, సీడబ్ల్యూసీతో) సర్వే జరగాలి.
28 వేల మందిపై ముంపు ప్రభావం పడనున్న నేపథ్యంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి.
ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మహారాష్ట్ర అఽభ్యంతరాల మేరకు ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్(పీఎంఎ్‌ఫ)పై అధ్యయనం జరిగింది. ఈ మేరకు పోలవరం పీఎంఎఫ్ 50 లక్షల క్యూసెక్కులుగా అంచనా వేసి, అధ్యయనం చేయాలి.
జూలైలో నమోదైన వరదకు, సీడబ్ల్యూసీ, ఏపీ సమర్పించిన నివేదికల్లో పేర్కొన్న వరద లెక్కల మధ్య తేడాలున్నాయి.
21.5 లక్షల క్యూసెక్కుల వరదకే భద్రాచలం పరిసర ప్రాంతాలు 5 రోజులు నీళ్లలో ఉన్నాయి. 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితేంటి?
పోలవరంలో పూడికపైనా అధ్యయనం చేపట్టి, స్పిల్‌వేలో మార్పులు చేయాలి.
పోలవరం ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రోటోకాల్‌లో మార్పులు చేపడితే.. తెలంగాణను భాగస్వామ్యం చేయాలి.
బచావత్ ట్రైబ్యునల్‌లోని క్లాజ్-6 ప్రకారం ప్రాజెక్టు వ్యయంలోనే బ్యాక్‌వాటర్ ముంపు ప్రాంతాల రక్షణ చర్యలకు అయ్యే వ్యయం చూపించాలి.
Updated Date - 2022-11-04T05:40:26+05:30 IST