Machilipatnam YCP: పేర్ని నాని.. ఆయన కొడుకు కిట్టూపై పీకల దాకా ఎందుకు ఉందంటే..
ABN, First Publish Date - 2022-12-12T11:53:37+05:30
బందరు వైసీపీలో విభేదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడి వైఖరితో ఇబ్బందుల పాలవుతున్న పార్టీ కార్యకర్తలు ఇటీవల నగరంలో..
బందరు వైసీపీలో విభేదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడి వైఖరితో ఇబ్బందుల పాలవుతున్న పార్టీ కార్యకర్తలు ఇటీవల నగరంలో రహస్య సమావేశం నిర్వహించారు. పార్టీని అంటిపెట్టుకుని అంకితభావంతో పని చేస్తున్న కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండటంతో ఈ తరహా బాధితులంతా ఏకమయ్యేందుకు ఇటీవల సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే పేర్ని నాని, కుమారుడు కిట్టూ అనుసరిస్తున్న విధానాలను సీఎం జగన్ వద్ద ఏకరువు పెట్టాలని అసమ్మతివాదులంతా నిర్ణయించడం గమనార్హం.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బలరామునిపేటకు చెందిన ఒక కార్యకర్త మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తన కారును అద్దె ప్రాతిపదికన పెట్టాడు. ఇటీవల కాలంలో సదరు కార్యకర్తను ఎమ్మెల్యే, ఆయన కుమారుడు పట్టించుకోకపోవడంతో.. ఎంపీ వద్దకు తరచూ ఆ కార్యకర్త వెళుతున్నారు. ఎంపీ వద్దకు వెళ్లవద్దని సదరు కార్యకర్తకు ఎమ్మెల్యే కుమారుడు పలు మార్లు చెప్పాడు. అయినా సదరు కార్యకర్త వినలేదు. దీంతో ఈ కార్యకర్తకు సంబంధించిన కారును అద్దె ప్రాతిపదిక నుంచి తప్పించారు.
తనకు జరిగిన అన్యాయంపై ఆ కార్యకర్త సహచరులకు చెప్పడంతో వైసీపీలోని అసమ్మతివాదులంతా ఒక తాటిపైకి వచ్చేందుకు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గతంలో పార్టీ ఆరంభం నుంచి పార్టీ కోసం పని చేసిన ఒక నాయకుడికి చెందిన ఇంటిని నెలకు లక్ష రూపాయలకు బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ అంశంలో కూడా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పురపాలకశాఖ అధికారులపై ఒత్తిడితెచ్చి బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతులు ఇవ్వకుండా చేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. మచిలీపట్నం బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న ఐటీఐ కళాశాలపై కొందరు ఇటీవల దాడి చేసి అద్దాలు పగులకొట్టారు. ఈ ఘటనలో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడిన అంశం కూడా చర్చకు వచ్చింది. వ్యాపారుల వర్గానికి చెందిన పెద్దలంతా ఈ ఘటనపై గుర్రుగానే ఉన్నారు. వ్యాపారవర్గాలకు చెందిన పెద్దలతోనూ సంప్రదింపులు జరపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీకి చెందిన ఒకరిద్దరు బార్ అండ్ రెస్టారెంట్లు నడుపుతున్నారు. ఇటీవల కాలంలో పనిగట్టుకుని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేయించిన అంశంపైనా వైసీపీలోని అసమ్మతి వాదులు చర్చించారు. బీసీ సామాజికవర్గాల వారిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచే స్తున్న అంశాలపైనా చర్చించారు.
కార్పొరేటర్ వసూళ్ల దందా
మునిసిపల్ కార్పొరేషన్‌లో గృహ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అంశం ఎమ్మెల్యే తనయుడికి సన్నిహితంగా ఉంటున్న ఒక కా ర్పొరేటర్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఈ అనుమతులు ఇప్పించడానికి కార్పోరేటర్ లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. నిత్యం ఎమ్మెల్యే కుమారుడి వెంట ఉండే సదరు కార్పొరేటర్‌ను ప్రసన్నం చేసుకుని, ఆయన చెప్పినంత నగదు ఇస్తేనే అనుమతులు మంజూరవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారి ఈ కార్పొరేటర్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారనే అంశం అసమ్మతివాదుల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటికే ఈ కార్పోరేటర్ చేసిన అవినీతిపై సమాచారాన్ని వైసీపీ అసమ్మతివాదులు సేకరించారు. టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని కార్పొరేటర్ తన చెప్పుచేతల్లో పెట్టుకుని వసూళ్లకు పాల్పడటం, మేయర్ చెప్పినా జరగని పనులు కార్పొరేటర్ కనుసైగతో జరుగుతుండటం వంటి అంశాలపైనా నివేదికను తయారు చేశారు. మిగిలిన కార్పోరేటర్లు చెప్పిన పనులు ముందుకు సాగకపోవడం తదితర అంశాలపై చర్చించారు.
బందరు నియోజకవర్గంలో వైసీపీలో ఒకరిద్దరికే ప్రాధాన్యత ఇచ్చి, మిగిలిన స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టడంపై తొలుత ఎంపీ వల్లభనేని బాలశౌరి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో అసమ్మతివాదులు నిర్ణయించారు. అయితే. ఆయన వద్దకు వెళితే పార్టీలో వర్గపోరును తెరపైకి తెచ్చిన వారమవుతామని, ఇలా కాకుండా సీఎం వద్దకే నేరుగా వెళ్లి పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
విజయసాయిరెడ్డితో కీలక నేత భేటీ
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారపార్టీకి చెందిన కీలక నేత ఒకరు నవంబరు నెల చివరి వారంలో ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను దూరం పెట్టడం, ఒకరిద్దరు చోటా నాయకులను అందలం ఎక్కించడం, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అసంతృప్తులు, బీసీ, ఎస్సీ వర్గాల నాయకులను దూరం పెట్టడం, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యం, తదితర అంశాలపై ఎంపీకి కూలంకుషంగా వివరించినట్లు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.
Updated Date - 2022-12-12T11:54:14+05:30 IST