Seediri Appalaraju: ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి సీదిరి వ్యాఖ్యల పరమార్థం ఏంటో..?
ABN, First Publish Date - 2022-11-29T19:38:55+05:30
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అధికార వైసీపీ మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో..
శ్రీకాకుళం: ఏపీలో (Andhra Pradesh) ముందస్తు ఎన్నికల (Early Polls) ఊహాగానాల నేపథ్యంలో అధికార వైసీపీ మంత్రి సీదిరి అప్పల రాజు (Seediri Appalaraju) చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రగతిభవన్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు తన ప్రసంగంలో పదే పదే ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మనం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని, చిన్న చిన్న అరమరికలు, తేడాలు ఉంటే తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అప్పలరాజు పార్టీ శ్రేణులకు సూచించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని మంత్రి బొత్స గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకూ అధికారంలో ఉంటామని, గెలిస్తే మరో ఐదేళ్లు కొనసాగుతామని ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు.
ముందస్తు ఎన్నికలపై వైసీపీ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీ అధినేత జగన్ మాత్రం ముందస్తుపై ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్టే తెలుస్తోంది. ఆలస్యం చేస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని ఆయన భావిస్తున్నారు. గడపగడపలో ప్రజల తిరస్కారం అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళితే నష్టం తప్పదని వైసీపీ అధినేత జగన్‌లో కలవరపాటు మొదలైంది. చాలా మంది మంత్రులు కూడా అదే భయంలో ఉన్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోవకు చెందినవే కావడం గమనార్హం. వైసీపీ శ్రేణులకు ఇప్పటికే ఆ సంకేతాలు అందగా.. టీడీపీ కూడా ముందస్తుకు సిద్ధంగానే ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి ఎమ్మెల్యే సీటుపై అభ్యర్థులకు చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారు. అవసరమైతే కొందరిని పక్కనపెట్టి పార్టీలో చురుకుగా ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కూడా టీడీపీ అధినేత భావిస్తున్నారు.
ఇక.. జనసేన అధినేత పవన్ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలో నిలిచేందుకు జన సైనికులను సమాయత్తం చేస్తున్నారు. 2024 వరకూ ఎన్నికల కోసం వేచి ఉండాల్సిన పనిలేదని, ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పవన్ ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే జన సైనికులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. మొత్తంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు మంత్రి అప్పలరాజు తాజా వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
Updated Date - 2022-11-29T20:18:14+05:30 IST