scorecardresearch

నగల వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-11-21T00:45:25+05:30 IST

నర్సీపట్నంలోని ఒక ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో నగల వ్యాపారితోపాటు అతని కుమారుడు మృతిచెందారు. భార్య, కుమార్తె పరిస్థితి విషమంగా వుంది.

నగల వ్యాపారి ఇంట్లో అగ్నిప్రమాదం

పొగతో ఊపిరి ఆడక తండ్రి, కొడుకు మృతి

వ్యాపారి భార్య, కుమార్తెల పరిస్థితి విషమం

విశాఖ కేజీహెచ్‌కు తరలింపు

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌గా భావిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

నర్సీపట్నంలో తెల్లవారుజామున ఘోరం

నర్సీపట్నం, నవంబరు 20: నర్సీపట్నంలోని ఒక ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో నగల వ్యాపారితోపాటు అతని కుమారుడు మృతిచెందారు. భార్య, కుమార్తె పరిస్థితి విషమంగా వుంది. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే వుందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, మృతుడి సోదరుడు తెలిపిన వివరాలు...

నర్సీపట్నం కృష్ణాబజార్‌ సమీపంలో ‘అంబిక జ్యూవెలరీస్‌’ పేరుతో నవర మల్లేశ్వరరావు ఉరఫ్‌ నానాజీ (45) నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. డూప్లెక్స్‌ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణం వుండగా, పైన రెండు అంతస్థుల్లో కుటుంబంతో నివాసం వుంటున్నారు. ఇతనికి భార్య సుజాత, కుమార్తె జాహ్నవి(20), కుమారుడు మౌలిష్‌ (19) ఉన్నారు. జాహ్నవి నర్సీపట్నానికి సమీపంలోని మాకవరపాలెం మండలం తామరంలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతూ రోజూ ఇంటి నుంచి వెళ్తి వస్తున్నది. మౌలేష్‌ విశాఖపట్నం దువ్వాడలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే వుంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో మౌలిష్‌ శనివారం సాయంత్రం వైజాగ్‌ నుంచి నర్సీపట్నం వచ్చాడు. శనివారం రాత్రి భోజనాలు చేసిన తరువాత మొదటి అంతస్థులోని బెడ్‌రూమ్‌లో జాహ్నవి, రెండో అంతస్థులోని బెడ్‌రూమ్‌లో నానాజీ, భార్య, కుమారుడు నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో మొదటి అంతస్థు హాలులో మంటలు లేచాయి. ఫర్నీచర్‌, కర్టెన్లు, ఇతర సామగ్రికి మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు రెండో అంతస్థులోకి కూడా పాకడంతో నానాజీకి మెలకువ వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిందని గ్రహించి వెంటనే పక్కింట్లో ఉంటున్న సోదరుడు నవర అప్పారావుకి ఫోన్‌ చేశాడు. ఇంట్లో మంటలు లేచాయని, వెంటనే వచ్చి కాపాడాలని కోరాడు. అప్పారావు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ చేయాలని తన కుమారుడు మణికుమార్‌కు చెప్పి, ఇరుగుపొరుగు వారిని నిద్రలేపి తమ్ముడి ఇంటివద్దకు వచ్చాడు. అయితే ఇంటికి అన్ని వైపులా గేట్లకు తాళాలు వేసి ఉండడంతో లోపలకు వెళ్లలేకపోయారు. పై అంతస్థుల్లో మంటలు వ్యాపించడంతో ఒక్కరు కూడా కిందకు వచ్చి తాళాలు తీసే పరిస్థితి లేకుండా పోయింది. కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. గేట్లకు వేసి వున్న తాళాలను గునపాలతో విరగ్గొట్టి మొదటి అంతస్థులోకి వెళ్లారు. బెడ్‌ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న జాహ్నవిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే రెండో అంతస్థులోకి వెళ్లి చూడగా నానాజీ, సుజాత, మౌలిష్‌ అపస్మారక స్థితిలో పడివున్నారు. సుజాతను తాళ్ల సహాయంతో కిందకు దించారు. మిగిలిన ఇద్దరిని మెట్ల మార్గం నుంచి తీసుకొచ్చారు. నలుగురినీ ఏరియా ఆస్పత్రికి తరలించగా నానాజీ, మౌలిష్‌ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సుజాత, జాహ్నవిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా వుండడంతో ఐసీయూలో వుంచారు. మూడు రోజులు గడిస్తే తప్ప ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. కాగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి వుంటుందని భావిస్తున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. పట్టణ సీఐ గణేశ్‌, ఎస్‌ఐ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకొని నానాజీ బంధువుల నుంచి వివరాలు సేకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భద్రతా చర్యలే ప్రతిబంధకాలు!

నగల షాపు, నివాసం ఒకే భవనంలో ఉండడంతో నానాజీ పలు రక్షణ చర్యలు చేపట్టారు. మొదటి అంతస్థులో రోడ్డువైపునకు ఒక షాపు, దాని వెనుక ఒక బెడ్‌ రూమ్‌, హాల్‌ వున్నాయి. షాపులోకి వెళ్లడానికి కింది నుంచి రౌండ్‌ మెట్లు ఏర్పాటు చేశారు. పై అంతస్థులోని షాపు పక్క నుంచి మొదటి అంతస్థులోకి వెళ్లడానికి దారి వుంది. అదే విధంగా ఇంటిలోకి వెళ్లడానికి కుడివైపున చిన్న సందు వుంది. దీని పక్కనున్న ప్రహరీ గోడ మీద నుంచి శ్లాబ్‌ వరకు ఇనుప గ్రిల్స్‌ బిగించారు. మొత్తం నాలుగుచోట్ల గేట్లకు లోపలి వైపు నుంచి తాళాలు వేశారు. దీంతో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న నానాజీ కుటుంబాన్ని కాపాడడానికి బయట నుంచి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2022-11-21T00:45:27+05:30 IST