Union Finance Minister Nirmala Sitharaman : వడ్డీలు కట్టడానికి అప్పులు
ABN, First Publish Date - 2022-10-29T04:30:11+05:30
దేశ ప్రజలకు ఉచితంగా తాయిలాలు అందించడంపై విస్తృతంగా చర్చ జరగాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అవన్నీ అసెంబ్లీలో సభ్యులకు తెలిసే జరుగుతున్నాయా?, ప్రజలకు కూడా ఆ వివరాలు
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నదిదే
ఉచితాలపై చర్చ జరగాల్సిందే: నిర్మలా సీతారామన్
పూట గడవడానికి అప్పులు చేసే ప్రభుత్వాలు
ఎంతో కాలం మనుగడ సాగించలేవు: జేపీ
విశాఖలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలకు ఉచితంగా తాయిలాలు అందించడంపై విస్తృతంగా చర్చ జరగాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అవన్నీ అసెంబ్లీలో సభ్యులకు తెలిసే జరుగుతున్నాయా?, ప్రజలకు కూడా ఆ వివరాలు చెబుతున్నారా? లేదా? అనే అంశాలు చర్చకు పెట్టాలన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తున్నాయని, ఇది మంచి విధానం కాదన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శతజయంతి ఉత్సవాలను శుక్రవారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సంక్షేమం... సుపరిపాలన’ అంశంపై ప్రధాన వక్తలు స్మారక ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు అందించడమే సుపరిపాలనగా విశ్లేషించారు. సాంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ప్రతి ఎంపీ రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా, ఎటువంటి అదనపు నిధులు కేటాయించకుండానే అమలులో ఉన్న పథకాలనే అందజేసి అభివృద్ధి చూపించగలిగామన్నారు.
సుపరిపాలనకు ఇంతకు మించిన ఉదాహరణలు అవసరం లేదన్నారు. ప్రజలు... ప్రభుత్వం వేరు కాదని, వారి విశ్వాసం పొందేలా ప్రభుత్వం పనిచేయా ల్సి ఉంటుందన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎవరి సంతకాలు, ష్యూరిటీలు అవసరం లేకుండానే బ్యాంకు రుణాలు మంజూరు చేసేలా విధానాలు మార్చామన్నారు. రోజ్‌గార్ మేళాలో 10లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. చిన్నచిన్న పొరపాట్లకు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కేవ లం జరిమానాతో బయటపడే విధంగా చట్టంలో మా ర్పులు తెచ్చామన్నారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోని ప్రభుత్వాలు మంచి పాలన అందించలేవన్నారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో లబ్ధిదారులకు కేవలం 15 పైసలే చేరుతోందనే వాదన ఉందని, కానీ, మోదీ ప్రభుత్వంలో సాంకేతికతను ఉపయోగించుకొని రూపాయికి రూపాయి నేరుగా లబ్ధిదారులకు అందేలా చూస్తున్నామన్నారు. ఇది సుపరిపాలనకు చక్కటి నిదర్శనమన్నారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, అది కేంద్రానిది, ఇది రాష్ట్రానిది అని తప్పించుకోలేమన్నారు. సాధికారత అనేది కొందరు హక్కుగా భావిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రసంగిస్తూ, దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నవారు తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారని, నిజాయితీపరులు అందులో సగమైనా మాట్లాడకపోతే ప్రజలు నష్టపోతున్నారని, అందుకే తాను వాస్తవాలు మాట్లాడుతున్నానన్నారు. సహజ వనరులను కూడా కాపాడుకోలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ఏపీలో డబ్బులు వృథా అవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.91వేలు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని, అయితే దానివల్ల ఆశించిన ప్రయోజనా లు రావడం లేదన్నారు. ఈ సభలో గీతం అధ్యక్షులు ఎం.శ్రీభరత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో తప్పటడుగులు
దేశంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి ఎన్నికలు కావని, వేలం పాటలని జయప్రకాష్ నారాయణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ బ్బున్న వాళ్లు, వారసత్వంతో వస్తున్న వాళ్లకే రాజకీయం గా అవకాశాలు వస్తున్నాయని, సామర్థ్యం ఉన్నవాళ్లకు నాయకత్వాన్ని అందించడం లేదని చెప్పారు. మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నామ ని, పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా సమర్థులు నాయకులు కాలేరని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. వారసు లు, ఎంత ఖర్చు పెట్టగలరు, ఏ కులం.. అని చూసి నా యకులను ఎన్నుకుంటున్నారని చెప్పారు. భారత సం తతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారని, ఆయన్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అదే రిషి సునాక్ భారత్‌లో ఉన్నట్టయితే ఏ పార్టీ అయినా సీటు ఇచ్చేదా? అని ప్రశ్నించారు.
ఎన్‌టీఆర్ గొప్ప మానవతావాది
ఆర్థ్రత కలిగిన నాయకుడు
లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీ
విశాఖపట్నం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్ గొప్ప మానవతావాది, ఆర్థ్రత కలిగిన నాయకుడని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కొనియాడారు. శుక్రవా రం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ప్రసంగించారు. పేదలు వారి కాళ్లపై వారు నిలబడేలా, ప్రభుత్వం సాయపడాలని చెప్పేవారన్నా రు. అంతే తప్ప ఆ రోజుకు పూట గడవడం ము ఖ్యం కాదని ఎన్‌టీఆర్ అనేవారని, అదే సుపరిపాలన లక్షణమన్నారు. స్థానిక ప్రజలు తమ సమస్యలపై నిర్ణయం తీసుకునేలా ‘క్రాంతిపథం’ పథకాన్ని ఆయన ప్రవేశపెడితే ఆ పథకం ద్వారా ప్రకాశం జిల్లాలో కలెక్టర్‌గా తాను లక్ష ఎకరాలకు సాగునీరు అందించగలిగానని, అక్కడి వారంతా పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. అధికారం ప్రజల చేతుల్లో ఉండాలనేది ఎన్‌టీఆర్ ఆశయమని, అదే నాయకుడి లక్షణమన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు ప్రజలకు సాధికారత కల్పించకుండా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాయని, అది మంచి పద్ధతి కాదన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి మాట్లాడుతూ, తన తండ్రి ఎన్‌టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఏడాది పొడవునా ప్రతినెలా ఒక కార్యక్రమం చేపట్టాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించారని, ఆ ప్రకా రం తిరుపతిలో మొదటి కార్యక్రమం నిర్వహించి, విశాఖలో రెండో కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ యన పరిపాలన ఎలా ఉండేదో చెప్పడానికి ఆ యనతో పనిచేసిన వారిని సభకు ఆహ్వానించామన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారిని ఘనంగా సన్మానించారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రాపర్తి జగదీశ్‌కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుంకర వెంకట ఆదిరానాయణ, భాగవతుల చారిటబుల్ ట్రస్టుకు చెందిన శ్రీరామ్‌ను సన్మానించారు.
Updated Date - 2022-10-29T04:30:16+05:30 IST