CM jagan: బైజూస్ గొప్ప సంస్థ! అందుకే డీల్..!
ABN, First Publish Date - 2022-12-22T11:23:09+05:30
‘ట్యాబ్‌ల(tabs)లో అందించే కంటెంట్ బైజూస్ సంస్థ (Byjus company) ఉచితంగా ఇస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద
ట్యాబ్‌లకు ఫ్రీ కంటెంట్ అందిస్తోంది
దీనివల్ల రూ. 15 వేలకే ఒక్కో ట్యాబ్
కార్పొరేట్ సామాజిక బాధ్యత నెరవేర్చిన సంస్థ
ఆ కంటెంట్‌నూ కలిపితే ట్యాబ్‌లకు 1,466 కోట్లు
ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు
పిల్లల మంచి పెత్తందార్లకు నచ్చడంలేదని విమర్శ
బాపట్లలో ట్యాబ్‌ల పంపిణీ.. అదే వేదికపై బర్త్‌డే
ట్యాబ్‌లకు ఫ్రీ కంటెంట్ అందిస్తోంది: జగన్
బాపట్ల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘ట్యాబ్‌ల(tabs)లో అందించే కంటెంట్ బైజూస్ సంస్థ (Byjus company) ఉచితంగా ఇస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద (సి.ఎస్.ఆర్.) రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఉచితంగా దానిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీంతో ఒక్కో ట్యాబ్ రూ.15,500 పడుతుంది. ఆ సంస్థ అందించే కంటెంట్‌తో కూడా కలిపితే ట్యాబ్‌ల మొత్తం విలువ రూ.1,466 కోట్లు. ఇక నుంచి ఏటా బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు అందిస్తాం’’ అని సీఎం జగన్(Cm jagan) అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ట్యాబ్‌లను నష్టం కలిగించే అంశాలకు వాడకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ద్వారా కత్తెర వేసినట్టు విద్యార్థులను ఉద్దేశించి జగన్ చమత్కరించారు. ‘‘మూడున్నరేళ్ల కాలంలో నిండుమనసుతో విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాను. వారి కోసమే డిజిటల్ విప్లవాని(Digital revolution)కి శ్రీకారం చుట్టాం’’ అని తెలిపారు. కులం వల్లో, ఆర్థికస్థోమత కారణంగానో కొన్నివర్గాల పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయలేకపోతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పిల్లలకు జరుగుతున్న మంచిని పెత్తందార్లు చూడలేకపోతున్నారని విమర్శించారు. విద్యార్థులకు మంచి చేయాలని ఇంగ్లీష్ మీడియం తెస్తే, దానిపైనా కోర్టుకెళ్లారని విమర్శించారు.
విద్యార్థులకు తప్పని కష్టాలు
సభాప్రాంగణానికి దాదాపు రెండు కిలోమీటర్ల అవతల వాహనాలను నిలిపివేయడంతో ఉదయాన్నే మంచులో విద్యార్థులకు నడక కష్టాలు తప్పలేదు. ట్రాఫిక్‌ను ఛేదించుకుని నడుచుకుంటూ యడ్లపల్లి రోడ్డుకు వచ్చిన విద్యార్థులను సమయం దాటిపోయిందని పోలీసులు నిలువరించారు. సభ అయిపోయేసరికి మధ్యాహ్నం ఒంటి గంట దాటడం, విద్యార్థులెవరికీ భోజన సదుపాయం కల్పించకపోవడంతో చాలామంది ఆకలితో అలమటించిపోయారు. మరోవైపు.. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో గోడలు దూకి వెళ్లడానికి ప్రజలు ప్రయత్నించారు. వారిని ఆపడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు.
వేదిక మీదే పుట్టిన రోజు వేడుకలు...
బుధవారం సీఎం జగన్మోహనరెడ్డి జన్మదినం కూడా కావడంతో సభావేదికపైనే ఆ వేడుకను జరిపారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి సీఎం కేక్ కట్‌చేశారు.
రోడ్ల పరిస్థితి బాగాలేదు సార్ : మంత్రి నాగార్జున
తన నియోజకవర్గంలో (వేమూరు) రహదారుల పరిస్థితి బాగాలేదని మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna).. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఓలేరు బ్రిడ్జితో పాటు లంక భూములకు పట్టాలు, కృష్ణానదికి తరచూ వరదలతో ప్రజలు పడుతున్న ఇక్కట్లను జగన్‌కు సభావేదికగా వివరించారు
Updated Date - 2022-12-22T11:24:43+05:30 IST