ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Teachers Transfers: 200 మంది కోసం.. 2 లక్షల మందికి పాట్లు

ABN, First Publish Date - 2022-11-05T12:55:02+05:30

కేవలం 200 మంది టీచర్ల కోసం 2 లక్షల మంది టీచర్లకు వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బదిలీలు అవిగో, ఇవిగో అంటూ ఆడుకుంటోంది. గత మూడు వారాలుగా ప్రతిరోజూ జీవో, షెడ్యూలు అంటూ హడావుడి చేస్తున్నా... ఇప్పటికీ బదిలీల జీవో విడుదల చేయలేదు

2 లక్షల మందికి పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయులతో బదిలీలాట

సిఫారసు బదిలీల కోసం నేతల పట్టు

చెడ్డ పేరు వస్తుందంటున్న కీలక నేత

నిలిచిపోయిన సాధారణ బదిలీల ప్రక్రియ

3 వారాలుగా షెడ్యూలంటూ హడావుడి

ప్రతిరోజూ ఇస్తామంటూ వాయిదాలు

ఇప్పటికే పలుమార్లు మంత్రి ప్రకటన

ఏదో ఒకటి తేల్చాలంటున్న టీచర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): కేవలం 200 మంది టీచర్ల కోసం 2 లక్షల మంది టీచర్లకు వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బదిలీలు అవిగో, ఇవిగో అంటూ ఆడుకుంటోంది. గత మూడు వారాలుగా ప్రతిరోజూ జీవో, షెడ్యూలు అంటూ హడావుడి చేస్తున్నా... ఇప్పటికీ బదిలీల జీవో విడుదల చేయలేదు. రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడితో 200 మందికిపైగా టీచర్లను సిఫారసులపై బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ బదిలీలపై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలిసింది. ఇలాంటి బదిలీల వల్ల టీచర్లలో చెడ్డపేరు వస్తుందని ఓ కీలక నేత అభిప్రాయపడగా... చేసి తీరాల్సిందేనంటూ సీమ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో అటు సిఫారసు బదిలీలు, ఇటు సాధారణ బదిలీలు మొత్తం నిలిచిపోయాయి. సాధారణ బదిలీలకు జీవో ఇస్తే ఇక సిఫారసుల మాట ఉండదు. అందుకే రాయలసీమ నేతల పట్టుతో మొత్తం ఆపేసినట్లు తెలిసింది. నేడో రేపో బదిలీల జీవో ఇస్తామంటూ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్లకు పలుమార్లు హామీలు ఇచ్చారు. తాజాగా మంగళవారం కూడా ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... బుధవారం ఇస్తామని తెలిపారు. అయినా ఇప్పటికీ బదిలీల జీవో ఊసే లేదు.

విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు..

ఎప్పుడూ లేనివిధంగా విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం బదిలీలకు తెరతీసింది. సాధారణంగా ఉపాధ్యాయ బదిలీలను వేసవి సెలవుల్లోనే చేస్తారు. బోధనపై ప్రభావం లేకుండా చేపడతారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక బదిలీలంటూ హడావుడి మొదలుపెట్టింది. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే చేపట్టినా బోధనపై ప్రభావం ఉండేది కాదు. ఇప్పుడు బదిలీలు చేస్తామంటున్న ప్రభుత్వం దానిపైనా ముందుకు వెళ్లడం లేదు. వివిధ కారణాలు చూపిస్తూ కావాలనే బదిలీలను ఆలస్యం చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బదిలీలపై విసిగిపోయిన టీచర్లు ఏదో ఒకటి తేల్చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. బదిలీలు చేయదలిస్తే షెడ్యూలు విడుదల చేయాలని, లేనిపక్షంలో లేవని చెప్పాలని, అంతే తప్ప వాయిదాలు వేయవద్దని అంటున్నారు.

ఇప్పటికే విలీన ప్రభావం

కీలకమైన తరగతుల విలీన ప్రక్రియను పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వం చేపట్టింది. దీంతో విద్యార్థులు అటూ ఇటూ మారాల్సి రావడంతో బోధన తీవ్రంగా దెబ్బతింది. విలీనంతో వేల పాఠశాలల్లో ఉపాధ్యాయులు తాత్కాలికంగా పాఠశాలలు మారాల్సి వచ్చింది. మరోవైపు ఇటీవల పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు. అటు విలీనంతో స్థానచలనం కలిగినవారు, ఇటు పదోన్నతులతో స్థానాలు మారాల్సిన వారి సంఖ్య పెరిగింది. దీంతో బదిలీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ప్రక్రియ ముందు నుంచే బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

జీరో సర్వీసుతో బదిలీలు

ఈసారి టీచర్లందరికీ బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం కనీస సర్వీసును జీరోగా నిర్ణయించారు. ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు గరిష్ఠ పరిమితి పెట్టారు. గరిష్ఠ పరిమితి దాటిన వారు కచ్చితంగా బదిలీ కావాలి. ఇతరులు సర్వీసుతో సంబంధం లేకుండా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో సర్వీసు రెండేళ్లుగా ఉండేది. కానీ ఈ సారి అనేక మార్పులు, చేర్పులు జరిగిన నేపథ్యంలో జీరో సర్వీసు కావాలని టీచర్లు కోరారు.

మరోవైపు..బదిలీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు టీచర్లలో మానసిక ఆందోళనను పెంచుతోంది. బదిలీలు అంటే వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రక్రియ కావడంతో ప్రణాళికలు వేసుకుంటున్నారు. కోరుకున్న చోటకు బదిలీ అవుతుందో లేదోననే ఆందోళన కూడా వారిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదే పదే వాయిదాలు వేయడం వారిలో అసహనం కలిగిస్తోంది.

Updated Date - 2022-11-05T13:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising