Minister KTR : గెలిచేది మేమే..
ABN, First Publish Date - 2022-11-03T04:51:38+05:30
మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, ప్రజలు ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని,
బీఆర్‌ఎస్ ప్రస్థానానికి అదే తొలి అడుగు
బీజేపీ స్థానం మొదటి నుంచీ మూడే
మునుగోడులో బీజేపీ ఓడిపోతుందని తెలిసే
అమిత్ షా, జేపీ నడ్డా సభలు రద్దు
బీజేపీ హింసకు పాల్పడితే తిప్పి కొడతాం
వాళ్లు పిడికెడు మందే.. మేం 60 లక్షలు
బీజేపీది శవాలపై పేలాలేరుకునే సంస్కృతి
స్వామీజీల వేషాల్లో ఎమ్మెల్యేల కొనుగోలా?
అలాంటి వాళ్లతో హిందూత్వకు అవమానం
రాహుల్‌వి గాలి తిరుగుళ్లు.. గాలి మాటలు
కాంగ్రెస్ ప్రతిపక్షం కావడం మోదీ అదృష్టం
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
పలివెల ఘటనలో గాయపడ్డ టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పరామర్శ
ఈటల ఆదేశంతోనే నాపై దాడి
మైక్‌లోనే అనుచరులను ఆదేశించారు: పల్లా
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 2, (ఆంధ్రజ్యోతి): మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, ప్రజలు ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని, బీఆర్‌ఎస్ ప్రస్థానానికి ఇదే తొలి ముందడుగు అవుతుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీ ముందునుంచీ మూడో స్థానంలోనే ఉందని, చివరి వరకు దాని స్థానం అదేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎలా కోవర్ట్ ఆపరేషన్ చేశారో.. ఇప్పుడు ఆయన వెంట ఉన్నవాళ్లు కూడా అదే చేస్తున్నారని చెప్పారు. తిరిగేది రాజగోపాల్‌తోనే అయినా, ఓటు మాత్రం ఆయనకు వేయరని వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్‌ఎ్‌సకు వచ్చే మెజారిటీ గురించి తాను ఇప్పుడు చెప్తే ఎక్కువనిపిస్తుందని.. కానీ అక్కడ ఫ్లోరోసిస్ లేకుండా ఇంటింటికీ నీళ్లిచ్చిన ప్రభావం మహిళల్లో బాగుందని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అందరికీ అందడం, అవి కొనసాగే అవకాశం టీఆర్‌ఎ్‌సతోనే ఉండడం తమకు మంచి మెజారిటీ సాధించి పెడతాయన్నారు.
మఠాధిపతి కాదు ముఠాధిపతి
బీజేపీ ప్రలోభాల అంశాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు తొలుత తనకే చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తాను సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే.. ఆయన పోలీసులను పిలిచి వివరించారని చెప్పారు. ‘‘స్వామీజీల వేషాల్లో వచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేంటి.. దరిద్రం కాకుంటే? కొనుగోలుకు వచ్చిన ఆయన్ను మఠాధిపతి అంటున్నారు. ఆయన ముఠాధిపతి. అలాంటివాళ్లను అడ్డం పెట్టుకుని హిందుత్వను కూడా అవమానిస్తున్నారు. రాజకీయం కోసం, అధికారం కోసం వారు ఎంతకైనా పోతరు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఐటీ, ఈడీ, సీబీఐలు ఏమీ చేయలేకపోవడంతో ముఠాధిపతులను రంగంలోకి దించారని ధ్వజమెత్తారు.
రాహుల్ గాలి తిరుగుళ్లెందుకు?
రాహుల్ పాదయాత్రను గాలి తిరుగుడుగా కేటీఆర్ అభివర్ణించారు. ‘‘అవసరమైన పనులు వదిలేసి, ముందే అస్త్ర సన్యాసం చేసేసి ఎక్కడో గాలి తిరుగుళ్లు, మాపై గాలి మాటలు ఏంటి?’’ అని రాహుల్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. గుజరాత్‌లో తీగల వంతెన కూలి వంద మందికిపైగా చనిపోతే సోనియా, రాహుల్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడమే మోదీ, బీజేపీల అదృష్టం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ వెంకట్‌రెడ్డి మునుగోడులో బీజేపీ అభ్యర్థికి ఓటేసేందుకే ఆస్ట్రేలియా నుంచి వచ్చారా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆ విషయంలో మోదీతో ఏకీభవిస్తా
గతంలో ఒక వంతెన కూలిపోయినప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది దేవుడి చర్య అని మోదీ అన్నారని, మరిప్పుడు జరిగింది కూడా గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేవుడి చర్యేనా! అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సీబీఐని పంజరంలో చిలుక అన్నారని, ఆయన వ్యాఖ్యలతో తాను ఇప్పుడు పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఒక్క సీబీఐనే కాక కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ బీజేపీ సర్కారు చెప్పు చేతల్లో పెట్టుకుందని విమర్శించారు. బ్రిటీషు కాలం నాటి సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని తొలగించుకోవాలి అంటున్న మోదీ.. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ల వ్యవస్థను కూడా రద్దు చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ పార్టీలను బీజేపీనే నిలబెట్టింది
మునుగోడులో టీఆర్‌ఎ్‌సను దెబ్బతీసేందుకు బీజేపీనే మరో రెండు పార్టీలను నిలబెట్టిందని, వాటికి అయ్యే ఖర్చంతా బీజేపీ వాళ్లే భరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘పశ్చిమబెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే సూత్రం అవలంబించారు. ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థులకు గాయాలు కావడం, గెలుస్తున్నామంటూ ఫేక్ సర్వే నివేదికలు విడుదల చేయడం కూడా ఆ పార్టీ వ్యూహంలో భాగమే’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘అదృష్టవశాత్తూ వాళ్ల కంటే ఎంతో మెరుగ్గా ఆలోచించి వ్యూహాలు రూపొందించగల కేసీఆర్ లాంటి నేత ఇక్కడ ఉండటంతో వారి వ్యూహాలు పనిచేయడం లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గెలవలేక సానుభూతి నాటకాలు
‘‘అక్టోబరు 31న మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తారని బీజేపీ ప్రకటించింది. అదే బహిరంగసభలో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని వ్యూహం పన్నారు. దాన్ని బయటపెట్టాం. దీంతో నడ్డా బహిరంగ సభే రద్దు చేసుకున్నారు’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతోందని భావించే ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా తమ సభలను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. గెలిచే అవకాశం లేదని తెలిసే పలివెలలో సానుభూతి నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. హింసకు పాల్పడే బీజేపీ సిద్ధాంతాన్ని తిప్పే కొట్టే శక్తి తమకుందని, చిల్లర మాటలతో తెలంగాణలో అగ్గిపెట్టే ప్రయత్నం చేస్తే దీటుగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
పలివెలలో బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి నాగోల్ ఎస్‌ఎల్‌ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఇతర కార్యకర్తలను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి బుధవారం కేటీఆర్ పరామర్శించారు.
మోదీనే పెద్ద ఫేక్
మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోతోందంటూ సీఎం కేసీఆర్ మాట్లాడినట్లుగా ఓ ఫేక్ ఆడియో సృషించారని కేటీఆర్ అన్నారు. ఇలా పిచ్చివేషాలు వేస్తే చాలా కాలం జైల్లో మగ్గాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని, ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్లని వదిలిపెట్టబోం అని హెచ్చరించారు. ఫేక్ వీడియోలు, ఆడియోలు నమ్మవద్దని మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీజేపీ వారి బతుకే ఫేక్ అని, మోదీ కన్నా పెద్ద ఫేక్ ఎవరూ ఉండరని విమర్శించారు.
ఇదే సంస్కృతి సాగితే తిరగబడక తప్పదు
పలివెలలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కుసుమ జగదీశ్‌తో పాటు 12 మంది కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి తలలు పగలగొట్టారని ఆరోపించారు. ఇదే సంస్కృతి కొనసాగిస్తే తాము తిరగబడక తప్పదని హెచ్చరించారు. ‘‘మీరు పిడికెడంత మంది ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలున్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించబోం’’ అని వ్యాఖ్యానించారు. సామాన్యులు నలిగి పోతారనే ఉద్దేశంతోనే తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.
శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్య సంస్కృతి బీజేపీది అని విమర్శించారు. 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ల పాటు ఎన్నో భావోద్వేగాలు, ఒత్తిళ్ల మధ్య తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన గత ఎనిమిదేళ్లలో ఎక్కడ ఎన్నిక జరిగినా ఉద్రిక్తతకు తావు ఇవ్వలేదన్నారు. మునుగోడులో హింసకు పాల్పడిన వారిపై ఫొటోలు, వీడియోల ఆధారంగా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీని కోరారు.
Updated Date - 2022-11-03T05:43:53+05:30 IST