1000 మంది రష్యా సైనికులు హతం
ABN, First Publish Date - 2022-11-03T04:53:09+05:30
రష్యా సేనలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సన్నద్ధంగా లేని సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడి ..
ఉక్రెయిన్ రక్షణ వర్గాలు వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 2: రష్యా సేనలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సన్నద్ధంగా లేని సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి భారీ షాకిచ్చింది. ఈ దాడిలో గత 24 గంటల్లోనే 1000 మంది రష్యా సైనికులు హతమైనట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 71 వేల మంది రష్యా సైనికులు మరణించారని పేర్కొంది. గత కొద్దిరోజులుగా కీవ్‌పై రష్యా వరుస దాడులకు దిగుతోంది. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు, తాగునీటి వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కోసం రష్యా ఇటీవల సైనిక సమీకరణ కూడా చేపట్టింది. దీనికోసం వేలాది మంది రిజర్విస్టులను పిలిపించింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించిన దాని ప్రకారం 41 వేల మంది రిజర్విస్టులను యుద్ధంలోకి దింపారు. అయితే వారివద్ద సరిపడా ఆయుధాలు లేవని బ్రిటిష్ రక్షణ నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సేనలు అదను చూసి దెబ్బకొట్టాయి. దాదాపు 1000 మంది రష్యా సైనికులను మట్టుబెట్టాయి.
నల్లగా మారిన పుతిన్ చేతులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ మొదలైంది. ఆయన శరీరం రంగు మారిందని, ఆయన చేతులపై వింత గుర్తులు కనిపిస్తున్నాయంటూ వార్తలు వెలువడ్డాయి. బ్రిటిష్ రిటైర్డ్ ఆర్మీ అధికారి, హౌస్ లార్డ్స్ సభ్యుడు రిచర్డ్ డనాట్ మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ ఆరోగ్యం అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఆయన చేతులు నల్లగా మారాయని, ఏదైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఇలా రంగు మారతాయని చెప్పారు. ఇతర భాగాల ద్వారా ఇంజెక్షన్లు తీసుకోలేనప్పుడు ఇలా చేతలకు చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. పుతిన్ అధునాతన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. గతేడాది మార్చిలో ఆయనపై హత్యాప్రయత్నం జరిగిందని, కానీ తృటిలో తప్పించుకన్నారని వార్తలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యంపై అనేక వదంతులు వినిపిస్తున్నాయి.
Updated Date - 2022-11-03T04:53:30+05:30 IST