Arvind Kejriwal: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
ABN, First Publish Date - 2022-11-05T19:31:00+05:30
గుజరాత్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో గుజరాత్ (Gujarat)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగితే మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyendar Jain)లపై విచారణలను నిలిపివేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఆరోపించారు. ‘ఆప్’ను విడిచిపెడితే ఢిల్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ ప్రతిపాదనను మనీశ్ సిసోడియా తిరస్కరించడంతో వారిప్పుడు తనను సంప్రదించారని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్రనాథ్, సిసోడియాను వదిలిపెట్టేస్తామని, వారిపై ఉన్న అన్ని కేసులను ఎత్తివేస్తామని తనకు ఆఫర్ చేశారని ‘ఎన్‌డీటీవీ టౌన్‌హాల్’ కార్యక్రమంలో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ఆ ఆఫర్ ఎవరిచ్చారన్న ప్రశ్నకు కేజ్రీవాల్ బదులిస్తూ.. ఆ పేరును తానెలా వెల్లడిస్తానని ఎదురు ప్రశ్నించారు. ఆఫర్ వారి ద్వారానే వచ్చిందని, ఇలాంటి విషయాల్లో బీజేపీ ఎప్పుడూ నేరుగా సంప్రదించదని పేర్కొన్నారు. అది ఒకరి నుంచి ఒకరికి ఇలా పలువురి ద్వారా చివరికి మనకు చేరుతుందని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికలు, ఢిల్లీలోని మునిసిపల్ ఎన్నికలను నిశితంగా గమనించిన తర్వాత రెండింటిలోనూ ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని, అందుకే తమ పార్టీని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని అన్నారు.
మనీశ్ సిసోడియాపై నమోదైన లిక్కర్ కుంభకోణం కేసు, జైన్‌పై నమోదైన హవాలా కేసు రెండూ తప్పుడు కేసులేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని బనాయించారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు. గుజరాత్‌లో ఆప్‌ను అడ్డుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని ఆరోపించిన ఢిల్లీ సీఎం.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు అధికారపార్టీ ప్రయోజనం చేకూరుస్తోందన్నారు. ఆప్ ఇప్పటికే ఈ రేసులో నంబరు-2 స్థానంలో ఉందని, కాంగ్రెస్ కంటే చాలా ముందు ఉందని అన్నారు. వచ్చే నెలల జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని కూడా దాటిపోతామని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-05T19:31:01+05:30 IST