Rajasthan: గెహ్లాట్, పైలట్ ఐక్యతారాగం
ABN, First Publish Date - 2022-11-29T20:14:16+05:30
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఊరట కలిగే పరిణామం రాజస్థాన్ కాంగ్రెస్లో మంగళవారంనాడు చోటుచేసుకుంది. రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత పోరు...
జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఊరట కలిగే పరిణామం రాజస్థాన్ కాంగ్రెస్ (Rajashan Congress)లో మంగళవారంనాడు చోటుచేసుకుంది. రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత పోరు రాహుల్ భారత్ జోడో యాత్రను ఇరకాటంలో నెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin pilot) ఐక్యతా సంకేతాలిచ్చారు. పార్టీ జనరల్ సెక్రటరీ, ఆర్గనేజేష్ కేసీ వేణుగోపాల్ మంగళవారంనాడు జైపూర్ చేరుకుని ఇద్దరు నేతలతో మంతనాలు సాగించిన అనంతరం కలిసికట్టుగా అంతా మీడియా ముందుకు వచ్చారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని ప్రకటించారు.
''మేమంతా ఐక్యంగా ఉన్నాం. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అరమరికలు లేని విధంగా కలిసికట్టుగా ఉన్నట్టు ఇక్కడున్న గెహ్లాట్, పైలట్ సైతం చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ నాయకులు ఇద్దరు (గెహ్లాట్, పైలట్) మాకు ఆస్తులని రాహుల్ కూడా చెప్పారు'' అని కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గెహ్లాట్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, గెహ్లాట్, పైలట్ ఇద్దరూ పార్టీ ఆస్తులని రాహుల్ చాలా స్పష్టంగా చెప్పారని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని తెలిపారు. రాజస్థాన్లో రాహుల్ గాంధీకి రెట్టించిన ఉత్సాహంతో ఘన స్వాగతం పలుకుతామని సచిన్ పైలట్ తెలిపారు. రాహుల్ 12 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ద్వారా రాహుల్ భారత్ జోడో చారిత్రక యాత్రగా నిలిచిపోనుందని ఆయన చెప్పారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న గుజరాత్లో అడుగుపెట్టనుంది.
Updated Date - 2022-11-29T20:14:18+05:30 IST