BJP state president: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
ABN , First Publish Date - 2022-12-10T08:39:29+05:30 IST
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి తగినన్ని స్థానాలను చేజిక్కించుకునేందుకు ప్రయ
చెన్నై, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి తగినన్ని స్థానాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) జిల్లాకార్యదర్శులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో గురువారం జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా, నేరుగానూ తన మనసులో మాట చెప్పారు. సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ఇక 16 నెలలే మిగిలి ఉందని, ఆ లోగా బూత్‌కమిటీలను పటిష్టపరచి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే రెండుగా చీలిన నేపథ్యంలో ఆయా వర్గాలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే బీజేపీ ప్రతిష్ఠ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినట్లే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. రాష్ట్రంలో జీ-20 ప్రాంతీయ సదస్సులు కోవై, చెన్నై, మహాబలిపురం నగరాల్లో నిర్వహించనున్నారని, ఆ సదస్సులు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగాఉండాలని అన్నామలై సూచించినట్లు తెలిసింది.
ఎన్డీయేలోనే ఉన్నాం: జయకుమార్
అన్నాడీఎంకే ఇంకా ఎన్డీయేలోనే కొనసాగుతోందని, రాష్ట్రానికి సంబంధించినంతవరకు కూటమికి అన్నాడీఎంకే నేతృత్వం వహిస్తోందని మాజీ మంత్రి డి.జయకుమార్ పేర్కొన్నారు. అన్నామలై ప్రకటనపై శుక్రవారం స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల కూటమి గురించి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాతే ఖరారవుతుందన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకోవడమే సహజమేనన్నారు. బీజేపీ నేత అన్నామలై జిల్లా కార్యదర్శులను ఉత్సాహపరిచేలా ఈ విధమైన ప్రకటన చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోనే మెగా కూటమి ఏర్పడుతుందని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారని, ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. అన్నాడీఎంకే కూటమితో వుండే మిత్రపక్షాలు మాత్రమే సులువుగా సీట్లు గెలవగలుగుతాయనే విషయాన్ని మరువకూడదని జయకుమార్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.