Satish Jarkiholi: భగ్గుమన్న హిందూ సంస్థలు.. చిక్కుల్లో కాంగ్రెస్
ABN, First Publish Date - 2022-11-09T14:33:27+05:30
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి.
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి (Karnataka Congress MLA Satish Jarkiholi) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. కర్ణాటక బెళగావిలో బీజేపీ ఆధ్వర్యంలో హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
హిందూ (Hindu) అనే పదం పర్షియన్ భాష (Persia) నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే అర్థం వస్తుందంటూ సతీశ్ జార్కిహోలి వ్యాఖ్యానించడంపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తుండగానే సతీశ్ జార్కిహోలి హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ సబబని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సతీశ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీశారు. తొలుత శివరాజ్‌పాటిల్, నేడు సతీశ్ జార్కిహోలి హిందువులను అవమానిస్తున్నారంటూ ఆమె విరుచుకుపడ్డారు. హిందూ ధర్మాన్ని అవమానించడం ఎంత వరకూ సబబని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌పాటిల్ ఇటీవలే భగవద్గీతలో కూడా జిహాద్ ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా సతీశ్ జార్కిహోలి హిందూ అంటే అత్యంత మురికి అని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.
అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పుంటే నిరూపించాలని, క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని సతీశ్ జార్కిహోలి వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యల్లో తప్పుందని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని సతీశ్ ప్రకటించారు. అయితే వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇప్పటివరకూ సతీశ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో హిందూ సంస్థలు నిరసనలు పెంచాయి.
ఇటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సతీశ్ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Updated Date - 2022-11-09T14:33:29+05:30 IST