kushboo: కుష్బూపై డీఎంకే నేత అసభ్యపదజాలం.. కనిమొళి క్షమాపణలు..
ABN, First Publish Date - 2022-10-28T13:13:38+05:30
డీఎంకే నేత సైదై సాదిక్ బీజేపీలోని మహిళ నేతలుగా నేతలుగా ఉన్న నటీమణులను అసభ్య పదజాలంతో దూషించారు. డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఆర్కే నగర్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
చెన్నై: తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే (DMK) నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. డీఎంకే (DMK), బీజేపీ (BJP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీలోని మహిళ నేతలుగా నటీమణులను డీఎంకే నేత సైదై సాదిక్ (saidai sadiq speech) అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖుష్బూ (kushboo) ఓ ట్వీట్ పెట్టారు. దీంతో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న కీలక నేత కనిమొళి (kanimozhi) దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. ‘‘ సైదై వ్యాఖ్యల పట్ల ఓ మహిళగా, మనిషిగా క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేం. దీనికి నేను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా. ఎందుకంటే మా నాయకుడు ఎంకే స్టాలిన్, మా పార్టీ ఇలాంటి వాటిని అస్సలు క్షమించరు’ అని ఆమె రాసుకొచ్చారు.
కాగా ఓ సమావేశంలో మాట్లాడిన డీఎంకే నేత సైదై.. ఖుష్బూ, గౌతమి, నమితా, గాయత్రి రఘురామన్‌లను ఉద్దేశించి పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ‘ఐటెమ్స్’ అని వ్యాఖ్యానించారు. ‘‘ డీఎంకేను నాశనం చేసిన వీళ్లు బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు’’ అని చెప్పుకొచ్చారు. అంతటితో కూడా ఆగకుండా మరిన్ని పరుష పదాలు ఉపయోగించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సైదై సాదిక్ వ్యాఖ్యలపై నటి ఖుష్బూ ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడడం వారి పెంపకాన్ని, పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలియజేస్తోంది. స్త్రీలను అవమానించే అలాంటి పురుషులు కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. గౌరవనీయులైన సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ పాలనా నమూనా ఇదేనా?’’ అని కుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే విమర్శల పాలవుతుండడంతో కనిమొళి స్పందించాల్సి వచ్చింది.
Updated Date - 2022-10-28T15:27:52+05:30 IST