Himachal Pradesh Results : హట్టీలకు ఎస్టీ హోదా... దళితుల ఆగ్రహానికి బలైన బీజేపీ...
ABN, First Publish Date - 2022-12-10T13:08:54+05:30
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా హట్టీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా హట్టీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ కోరుకున్నది జరగలేదు. వీరికి ఎస్టీ హోదా ఇవ్వడంతో రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న దళితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హట్టి (Hatti) సామాజిక వర్గంలోకి రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు తదితరులు వస్తారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని వీరు 1967 నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో వీరి డిమాండ్‌ను పరిష్కరించి, వీరికి ఎస్టీ హోదా కల్పించింది. అయితే తమ రిజర్వేషన్లపై దీని ప్రభావం పడుతుందనే ఆందోళన దళితుల్లో వ్యక్తమైంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో నాలుగు శాసన సభ నియోజకవర్గాల్లో హట్టీల ప్రాబల్యం ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో వీటిలో రెండిటిని బీజేపీ, రెండిటిని కాంగ్రెస్ గెలుచుకున్నాయి. తాజా ఎన్నికల్లో కూడా ఈ స్థానాలను ఆయా పార్టీలు నిలబెట్టుకున్నాయి.
సిమ్లాలో ఎనిమిది శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో హట్టీలు ఉన్నారు. అయితే బీజేపీ కేవలం చోపల్ నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి మూడు స్థానాలు లభించిన విషయం గమనార్హం.
Updated Date - 2022-12-10T13:08:57+05:30 IST