Kuwait: మరోసారి ప్రవాసులపై ఉక్కుపాదం.. ఏకంగా 1000 డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
ABN, First Publish Date - 2022-12-20T08:36:50+05:30
గల్ఫ్ దేశం కువైత్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులపై (Expats) మరోసారి ఉక్కుపాదం మోపింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులపై (Expats) మరోసారి ఉక్కుపాదం మోపింది. గడిచిన 40రోజుల్లో ఏకంగా వెయ్యి మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licenses) రద్దు చేసింది. వీరందరూ డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం (General Traffic Department) వెల్లడించింది. జీతం, విశ్వవిద్యాలయం డిగ్రీ, వృతి వంటి అంశాలు ప్రవాసులు కువైత్‌లో (Kuwait) డ్రైవింగ్ లెసెన్స్ పొందేందుకు నిర్ధిష్టమైన షరతులు. వీటిని పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రవాసుల ధృవపత్రాలు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖలేద్ (Minister of Interior Sheikh Talal Al-Khaled) సూచనల మేరకు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అధికారులు సమీక్షించడం జరుగుతోంది. దీనిలో భాగంగానే తాజాగా ఉల్లంఘనలకు పాల్పడిన 1000 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ ఉపసంహరించడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత వాహనాలు నడిపే వలసదారులను అరెస్ట్ చేయడానికి, దేశ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారిని బహిష్కరణకు రిఫర్ చేయడానికి ట్రాఫిక్ విభాగం పెట్రోలింగ్ బృందాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఒక ప్రవాసుడు కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. అంతేగాక రద్దు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆ దేశ జనరల్ ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది.
Updated Date - 2022-12-20T08:45:09+05:30 IST