Saudi Arabia: సౌదీ అరేబియా మరో సంచలనం.. 14 వేల ఎకరాల విస్తీర్ణంలో..
ABN, First Publish Date - 2022-12-10T13:16:39+05:30
గల్ఫ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia ) మరో సంచలనానికి తెరలేపింది.
రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia ) మరో సంచలనానికి తెరలేపింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని (Biggest Airport in the World) నిర్మించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల సౌదీ వెల్లడించింది. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 14వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఢిల్లీలోని ఇందిర గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో (Indira Gandhi International Airport) పోలిస్తే 3రేట్లు పెద్దది అన్నమాట. అంతేగాక ఏడాదికి సుమారు 12కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారట. 2030 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక ఈ విమానాశ్రయం నిర్మాణానికి అయ్యే వ్యయం పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (Public Investment Fund), దేశ సార్వభౌమ సంపద నిధి ద్వారా సమకూర్చాలని సౌదీ భావిస్తోంది. 2050 నాటికి విమానాశ్రయంలో 185 మిలియన్ల మంది ప్రజలు, 3.5 మిలియన్ టన్నుల కార్గో సేవలు నిర్వహించబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా కొత్త విమానాశ్రయం 1,03,000 ఉద్యోగాలు సృష్టిస్తుందని సౌదీ అరేబియా ఆశాభావంతో ఉంది. అలాగే 2030 నాటికి కింగ్‌డమ్‌కు ప్రతియేటా కనీసం 100 మిలియన్ల సందర్శకులను ఆహ్వానించాలని భావిస్తోంది.
Updated Date - 2022-12-10T13:16:41+05:30 IST