ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hijab protest: ఇరాన్‌లో మహిళాగ్రహ దావానలం

ABN, First Publish Date - 2022-11-02T07:30:52+05:30

మహిళల అభీష్టంతో ప్రమేయం లేకుండా వారి జీవన రీతులను నిర్దేశించే విధానం అన్ని సమాజాలలోనూ ఉన్నది. పాశ్చాత్య దేశాలలో అబార్షన్లపై ఆంక్షలు, ఇస్లామిక్ దేశాలలో వేషధారణపై కట్టడి మొదలైనవి అందుకు నిదర్శనాలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల అభీష్టంతో ప్రమేయం లేకుండా వారి జీవన రీతులను నిర్దేశించే విధానం అన్ని సమాజాలలోనూ ఉన్నది. పాశ్చాత్య దేశాలలో అబార్షన్లపై ఆంక్షలు, ఇస్లామిక్ దేశాలలో వేషధారణపై కట్టడి మొదలైనవి అందుకు నిదర్శనాలు. ఒక స్త్రీ ఏమి ధరించాలి, ఎక్కడకు వెళ్ళాలి, ఏమి చదవాలి అనేది అమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పురుషులే నిర్ణయిస్తారు. మతఛాందసవాదం ఎక్కువగా ఉండే ఇస్లామిక్ దేశాలలో అయితే ఏకంగా శాసనాల ద్వారా మహిళల జీవన విధానాన్ని శాసించడం జరుగుతోంది.

ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆయతుల్లా ఖోమైనీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన మొట్టమొదటి చట్టం యువతుల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుండి 9 సంవత్సరాలకు తగ్గించింది! ఇరాఖ్‌తో యుద్ధం ఉధృతంగా కొనసాగుతున్న కాలంలో 1983లో బురఖా ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ మరో చట్టం తీసుకువచ్చారు. ఇస్లామిక్ ఛాందసవాదం ఏకైక మౌలిక సూత్రంగా ఉన్న ఇరాన్‌లో మహిళల వేషధారణ విషయమై నెల రోజులకు పైగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు మతాధిపత్య ధోరణులను సవాల్ చేస్తున్నాయి. ఇరానియన్ సమాజంలో అపూర్వ సామాజిక, రాజకీయ చైతన్యాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి ముస్లిం మహిళ వేషధారణను చర్చనీయాంశంగా చేసాయి.

బురఖాను సరిగ్గా ధరించలేదనే అభియోగంపై మహసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్ యువతిని ధార్మిక పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని టెహ్రాన్‌లోని వొజారా జైలుకు తరలించారు. జైలుకు తీసుకువెళ్లిన మూడు రోజులకే అమీనీ మరణించింది. ఆమె మరణంతో ఇరానియన్ మహిళా లోకం ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. దేశ వ్యాప్తంగా నెల రోజులకు పైగా కొనసాగుతున్న నిరసన జ్వాలలు ఇప్పట్లో చల్లబడే పరిస్ధితులు కనిపించడం లేదు.

షియా ప్రాబల్య దేశమైన ఇరాన్‌లో సున్నీ తెగ అందునా మైనార్టీ వర్గానికి చెందిన కుర్దిష్ యువతి అనుమానాస్పద మృతిపై ఇరానియన్ సమాజమంతటా ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతోంది. తెగలకు అతీతంగా మహిళలు నిర్బంధ బురఖాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు దావానలంలా దేశవ్యాప్తంగా విస్తరించడం గమనార్హం. ఏదో ఒక రాజకీయ సమూహమో లేక ఒక నాయకుడో ఈ నిరసనలకు సారథ్యం వహించడం లేదు. తమ జీవితాలను నియంత్రిస్తున్న ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన ఇరాన్ మహిళలే ఈ నిరసనలను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. భద్రతా సిబ్బందితో సహా 234 మంది ఇంతవరకు ఈ నిరసనల సందర్భంగా మరణించారు. అంతేకాకుండా సుమారు 12 వేల మందిని అరెస్టు చేశారు. ఇది మాములు విషయం కాదు.

నీటి కొరత, గ్యాస్ ధరల పెరుగుదల మొదలైన సమస్యలకు వ్యతిరేకంగా గతంలో భారీ నిరసన ప్రదర్శనలు జరగకపోలేదు. అయితే ప్రస్తుతం ప్రజ్వరిల్లుతోన్న సాముహిక నిరసన జ్వాలలు ఇరాన్ పాలకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయనడంలో సందేహం లేదు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు ప్రప్రథమంగా ఎదుర్కొంటున్న పెద్ద అగ్నిపరీక్ష ఇది.

తాలిబాన్ల ఆఫ్ఘానిస్తాన్ లేదా మధ్యప్రాచ్యంలోని ఇతర అరబ్బు దేశాల మహిళల వలే కాకుండా ఇరానియన్ స్త్రీలు ప్రగతిశీలురు. ఈ ప్రాంతంలోని ఇతర ముస్లిం దేశాల మహిళలతో పోల్చితే ఎక్కువ విద్యాధికులు. ఇరాన్ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో 67 శాతానికి పైగా మహిళలే కావడం ఆసక్తికరమైన వాస్తవం. ఇరాన్ చమురు సంపదపై తొలుత బ్రిటన్, ఆ తర్వాత అమెరికా పెత్తనం చలాయించాయి. ఇరాన్ ప్రజలు ఆ విదేశీ పెత్తనాన్ని ఆయాతుల్లా ఖొమైనీ నేతృత్వంలో వ్యతిరేకించి షా (రాజు)ను గద్దె దింపారు. రాచరిక పాలనలో బ్రిటన్, అమెరికాలు చమురు సంపద కొల్లగొట్టినా ఇరాన్ బాగా అభివృద్ధి చెందింది. గల్ఫ్ దేశాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలోనే ఇరాన్ బాగా సంపద్వంతమయింది. అన్ని దేశాల వారికి ఒక ఆకర్షణీయమైన దేశంగా ఇరాన్ విలసిల్లింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫార్సీ భాష, పర్షియన్ సంస్కృతి అధ్యయనాలకు ప్రపంచ విద్వత్ లోకంలో సమున్నత ప్రాధాన్యమున్నది. భారతదేశం తన చమురు అవసరాలకు గల్ఫ్ కంటే ముందు ఇరాన్‌పైనే ఆధారపడేది. ప్రఖ్యాత హిందుజా గ్రూప్ సువిశాల వ్యాపార సామ్రాజ్యం తొలుత ఇరాన్‌లోనే ప్రభవించింది. భారత్‌లో ప్రసిద్ధిపొందిన ఆశోక్ లేలాండ్ ట్రక్కుల ఉత్పత్తి వ్యూహరచన కూడా ఇరాన్ నుంచే జరిగింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత హిందుజాలు ఇరాన్ నుంచి లండన్‌కు వెళ్లిపోయారు.

ఇస్లామిక్ విప్లవానంతరం ఇరానియన్ సమాజంలో ఇస్లామీకరణ ధోరణులు శరవేగంగా పెరిగిపోయాయి. ఒక వైపు ఇస్లామీకరణ, మరో వైపు అమెరికా ప్రతీకారం కారణాన బలహీనపడ్డ ఆర్థిక వ్యవస్థ దేశ యువతకు ఉపాధి కల్పనలో విఫలమైంది. ఈ కారణాన పాలకులపై ఆగ్రహం ఉంది కానీ అదే సమయంలో అమెరికాపై కూడ అంతకన్నా ఎక్కువ కోపం ఉంది. పొరుగున ఉన్న ఇరాఖ్‌ను అమెరికా దురాక్రమించిన తర్వాత ఇరాన్ ప్రాబల్యం మరింత పెరిగింది. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఇరాన్‌ను అస్థిరపరచాలని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాలేకపోతున్నాయి. దీన్నిబట్టి ఇరాన్ అంతర్గత వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో కుర్దిష్ యువతి మృతి అనూహ్యంగా ఇరాన్ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. బురఖా అనేది ఒక్క ఇరాన్‌కు సంబంధించిన అంశం కాదు. దాన్ని ధరించడం లేదా ధరించకపోవడం అనేది మహిళల అభీష్టానికి వదిలిపెట్టాలి. ఏ విధంగానూ నిర్బంధం కాకూడదు. ఇరాన్‌తో సహా ఎక్కడయినా సరే, ధార్మిక ఆచార వ్యవహారాలలో రాజకీయాల, పాలకుల జోక్యం ఉండకూడదు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-11-02T07:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising