Indian Embassy: కువైత్‌లోని భారతీయ ఇంజనీర్లకు ముఖ్య గమనిక.. గడువు ముంచుకొస్తుంది.. త్వరపడండి!
ABN, First Publish Date - 2022-12-11T07:35:27+05:30
కువైత్‌లో ఇంజనీర్లుగా పనిచేస్తున్న భారతీయుల కోసం అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా కొత్త రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది.
కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) ఇంజనీర్లుగా పనిచేస్తున్న భారతీయుల (Indian Engineers) కోసం అక్కడి ఇండియన్ ఎంబసీ (Indian Embassy) తాజాగా కొత్త రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను (Registration Drive) ప్రారంభించింది. చివరిసారిగా 2020లో భారతీయ ఇంజనీర్ల కోసం ఇలాంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో ప్రతి భారత ఇంజనీర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం చేపడుతున్న ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ రిఫరెన్స్ ప్రయోజనాల కోసం అవసరమైన ప్రస్తుత డేటాబేస్‌ను నవీకరించడమే లక్ష్యంగా సాగుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. ఎంబసీలో ఇంతకుముందు నమోదు చేసుకున్న వారితో సహా కువైత్‌లోని భారతీయ ఇంజనీర్లందరూ https://forms.gle/vFJaUcjjwftrqCYE6 లింక్‌లోని ఆన్‌లైన్ గూగుల్ ఫారమ్‌ను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ రిజిస్ట్రేషన్‌కు డిసెంబర్ 22 ఆఖరి తేదీ అని ఎంబసీ వెల్లడించింది. ఈ గడువులోపు భారతీయ ఇంజనీర్లు అందరూ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలని రాయబార కార్యాలయం సూచించింది.
ఇదిలాఉంటే.. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా కువైత్‌లో ప్రస్తుతం ప్రవాస ఇంజనీర్ల సర్టిఫికెట్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సహాకారంతో కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (Kuwait Society of Engineers) ప్రవాస ఇంజనీర్లు తాము ఉద్యోగాల్లో చేరినప్పుడు సమర్పించిన సర్టిఫికెట్లను వెరిఫై చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రవాసులు సమర్పించిన మొత్తం 5,248 సర్టిఫికెట్లలో గత ఆరు నెలల్లో 4,320 ఇంజనీరింగ్ సర్టిఫికేట్‌లను వివిధ దేశాల నివాసితులు ధృవీకరణ కోసం సమర్పించారు. ఇక ధృవీకరణలో ఏడు నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లను (Engineering Certificates) గుర్తించడం జరిగింది. వాటిలో నాలుగు భారత ప్రవాసులకు సంబంధించినవి కావడం గమనార్హం.
Updated Date - 2022-12-11T07:37:04+05:30 IST