BF.7 Variant: అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు.. ఆ 5 దేశాల నుంచి వచ్చేవారికి..
ABN, First Publish Date - 2022-12-25T10:25:17+05:30
మహమ్మారి కరోనా వైరస్ మరోసారి ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహమ్మారి కరోనా వైరస్ మరోసారి ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. మధ్యలో కొన్నాళ్లు తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 (Covid-19) ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. బీఎఫ్-7 వేరియంట్ (BF.7 Variant) చైనాలో స్వైరవిహారం చేస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా అక్కడ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ ఇప్పుడు నెమ్మదిగా ఇతర దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. మన దగ్గరు కూడా బీఎఫ్-7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రధానంగా ఈ వేరియంట్ ప్రభావం గట్టిగా ఉన్న ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.
చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు (RT-PCR Test) తప్పనిసరి చేస్తున్నట్లు భారత ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్ మాండవియా తెలిపారు. ఇక ప్రయాణికులలో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వారిని, కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు (International Arrivals) విమానాశ్రయాల్లో ప్రస్తుత వారి హెల్త్ స్టేటస్‌ను తెలియజేయడానికి ఎయిర్ సువిధ ఫారమ్‌ను కూడా నింపాల్సి ఉంటుందని తెలిపారు. శనివారం (డిసెంబర్ 24) నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
ఇక దుబాయ్‌లోని భారత కాన్సులేట్ (Indian Consulate in Dubai) కూడా శుక్రవారం తన అధికారిక ట్విటర్ (Twitter) ఖాతా ద్వారా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను పోస్ట్ చేసింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రకటించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి తాము ఆంక్షలను అమలు చేస్తున్నట్లు కాన్సులేట్ జనరల్ తన ట్వీట్‌లో పేర్కొంది. ప్రయాణికులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలని, విమానంలో అక్కడి సిబ్బంది చెప్పే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలిపింది. ఇక బోర్డింగ్ సమయంలో సామాజిక దూరం పాటించడం, ఎంట్రీ పాయింట్‌లో హెల్త్ అధికారులకు థర్మల్ స్క్రీనింగ్‌కు సహకరించడం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే స్క్రీనింగ్ సమయంలో ఎదైనా లక్షణాలు బయటపడితే మాత్రం వెంటనే ఐసోలేట్ చేయడం జరుగుతుందని కాన్సులేట్ అధికారులు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలను కూడా దుబాయ్‌లోని భారత కాన్సులేట్ సూచించడం జరిగింది.
Updated Date - 2022-12-25T11:08:48+05:30 IST