NRI: ఉగాండాలో ఘోరం.. భారత యువకుడ్ని కాల్చి చంపిన పోలీస్ కానిస్టేబుల్!
ABN, First Publish Date - 2022-10-30T09:56:50+05:30
ఉగాండాలో దారుణం జరిగింది. ఫీల్డ్ ఫోర్స్ యూనిట్‌కు (Field Force Unit) చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ భారత యువ వ్యాపారవేత్తపై (NRI businessman) కాల్పులకు పాల్పడ్డాడు.
ఎన్నారై డెస్క్: ఉగాండాలో దారుణం జరిగింది. ఫీల్డ్ ఫోర్స్ యూనిట్‌కు (Field Force Unit) చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ భారత యువ వ్యాపారవేత్తపై (NRI businessman) కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 24 ఏళ్ల భారత యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కుంతాజ్ పటేల్‌గా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్‌పై హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటన ఈ నెల 27న (గురువారం) ఉగాండాలోని కిసోరో టౌన్‌లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రం ఖేదా జిల్లాలోని థాస్రకు చెందిన కుంతాజ్ పటేల్ (24) తన భార్యతో కలిసి నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం ఉగాండా వెళ్లాడు. అక్కడ అతడి సోదరుడు నిర్వహిస్తున్న ఓ హర్డ్‌వేర్ షాపులో పనిచేస్తూ బయట ఓ చిన్న బిజినెస్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం కూడా కిసోరోలోని హర్డ్‌వేర్ దుకాణానికి రోజులాగే యధావిధిగా డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో దుకాణానికి వచ్చిన ఓ వినియోగదారుడితో పటేల్ మాడ్లాడుతుండగా ఎఫ్ఎఫ్‌యూకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎలియోడా గుమిజాము (21) అక్కడికి వెళ్లాడు. వెళ్తువెళ్తూనే తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో పటేల్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన పటేల్‌ను చికిత్స కోసం హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, హాస్పిటల్‌లో చేరిన కొద్దిసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఎలియోడా గుమిజామును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. పోలీసుల విచారణలో షాపు యజమాని అయిన పటేల్ సోదరుడిని చంపేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు తెలిపాడు. కానీ, ఆ సమయంలో దుకాణంలో పటేల్ ఉండడంతో పొరపాటున అతడిపై కాల్పులకు పాల్పడినట్లు చెప్పాడు. దాంతో నేరాన్ని అంగీకరించిన ఎలియోడా గుమిజాముపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు కిసోరో పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Updated Date - 2022-10-30T09:56:53+05:30 IST