TANA: తానా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
ABN, First Publish Date - 2022-12-27T22:13:33+05:30
పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో 27వ తేదీన గుంటూరులోని ఏసీ కాలేజీ ఆవరణలో తానా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది.
విద్య, వైద్యం పౌరుడి ప్రాథమిక హక్కని హైకోర్టు జడ్జి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో 27వ తేదీన గుంటూరులోని(Guntur) ఏసీ కాలేజీ ఆవరణలో తానా(TANA), గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం(Free Medical Camp) జరిగింది. ఈ శిబిరానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఖరీదైన, ఉన్నత ప్రమాణాలు కలిగిన వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు వేల మంది పేదలు ఉచిత వైద్య సేవలు పొందారు. ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు వైద్య సేవలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి కోట వంశీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కని అన్నారు. వైద్య శిబిరానికి 4 వేల మంది రావడం సంతోషంగా ఉందన్నారు. మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలనే తలంపు రావడం, దీనిని ఆచరణలో చేసి చూపడం చాలా గొప్ప విషయమని చెప్పారు. మానవసేవే మాధవ సేవని నిరూపించిన తానా, గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకులకు, కోట వంశీకి ఆయన అభినందనలు తెలిపారు.
టుబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ మాట్లాడుతూ.. ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ వైద్య శిబిరం ఒక వరమని పేర్కొన్నారు. వైద్యులు సేవాభావంతో వ్యవహరించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారన్నారు. కోట వంశీ మాట్లాడుతూ.. తమ అనారోగ్యాన్ని జయించి పేదలు చిరునవ్వులతో వెళ్తున్నప్పుడు పొందే ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో 27 మంది స్పెషలిస్టు వైద్యులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చి సేవలందించారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. సేవాభావానికి మారు పేరు తానా. స్వదేశంలోనూ, అమెరికాలో తానా సంస్థ సేవలు అందిస్తోంది. విద్యా, వైద్యంతో పాటు సాంస్కృతిక రంగాల్లో కూడా తమ సేవలను అందిస్తూ అటు కళాకారులను, ఇటు విద్యావంతులను, విజ్ఞానవంతులను ప్రోత్సహిస్తున్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినబాబు మాట్లాడుతూ.. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గోరంట్ల పున్నయ్య చౌదరి, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, రావి గోపాలకృష్ణ, రవి పొట్లూరి, విద్యాధర్ గారపాటి, వెంకట్ పొత్తూరు, వెంకటరమణ గన్నె, క్రాంతి ఆలపాటి, యర్రా నాగేశ్వరరావు, రమేష్ చంద్ర, గంటా పున్నారావు, శ్రీధర్ నాగళ్ల, ఏసీ కాలేజీ ప్రిన్సిపాల్ కె.మోజెస్, ట్రెజరర్ మోజెస్ ఆర్నాల్డ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను, తానా సభ్యులను ఈ సందర్భంగా వంశీ కోట సత్కరించారు.
Updated Date - 2022-12-27T22:13:35+05:30 IST