చిన్న పార్టీలతో పెద్ద సవాల్!
ABN, First Publish Date - 2022-10-22T20:13:09+05:30
మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నమైన పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
మునుగోడు బరిలో ఇతర పార్టీలు, స్వతంత్రులు
ఉప ఎన్నిక వేదికగా సత్తా చాటే ప్రయత్నాలు
ఇప్పటికే పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి నేతలు
వీరు సాధించే ఓట్లతో ప్రధాన పార్టీలపై ప్రభావం!
2018 ఎన్నికల్లో 6.59ు ఓట్లు చీల్చిన చిన్న పార్టీలు
13,327 ఓట్లు పొందిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు
తాజా పరిణామాలతో ప్రధాన పార్టీల్లో ఆందోళన
చిన్న పార్టీలు, స్వతంత్రులను బుజ్జగించే ప్రయత్నాలు!
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి/హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): హూజూర్‌నగర్ ఉప ఎన్నిక.. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే! దుబ్బాక ఉప ఎన్నిక.. త్రిముఖ పోటీలో అనూహ్య ఫలితం! నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.. మూడు పార్టీలు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే! హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ముక్కోణపు పోరు కనిపించినా రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోరు సాగింది. కానీ, మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నమైన పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్న పార్టీలు బరిలోకి దిగడం, ప్రచారాన్నీ సీరియ్‌సగానే నిర్వహిస్తుండడంతో మునుగోడులో సాధారణ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కాగా, చిన్న పార్టీలకుతోడు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలో నిలవడం ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్రులు సాధించే ఓట్లు ఎన్ని? ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరి ఓట్లను అవి చీల్చనున్నాయి? అది ఎవరి అవకాశాలను దెబ్బ తీస్తుంది? అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు.. ఈ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో సాధించే ఓట్లు, ఫలితంపై చూపించే ప్రభావాన్ని బట్టి వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం ఎంత అన్నది కూడా తేలిపోనుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ చిన్న పార్టీల ప్రభావం పెద్దగా లేదు. అయితే ఇటీవలి కాలంలో పలు పార్టీలు కొంత యాక్టివ్ అయ్యాయి.
ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో బీఎస్పీ..వీటిలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒకటి. ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ పొంది బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర సారథిగా ఉన్నారు. ఇప్పటికే ఎంతో కొంత ఓటుబ్యాంకు కలిగి ఉన్న బీఎస్పీలో.. ఈయన చేరడం పార్టీకి సానుకూల అంశమైంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందే ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌కుమార్ రాజకీయ అరంగేట్రం తర్వాత పూర్తిస్థాయి సన్నద్ధతతో పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మునుగోడులో పోటీ చేస్తోంది. త మ అభ్యర్థి ఆందోజు శంకరాచారితో కలిసి ప్రవీణ్‌కుమార్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
80 శాతం బీసీ ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో తాము బీసీ అభ్యర్థిని బరిలోకి దించినందున ఆ వర్గం ఓటర్లతోపాటు దళిత, బహుజన ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని బీఎస్పీ ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా ప్రవీణ్‌కుమార్ ఏడేళ్లపాటు గురుకులాల సంస్థ కార్యదర్శిగానూ సేవలందించడంతో ప్రచారంలో ఆయనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల పూర్వ విద్యార్థుల సంఘం (స్వేరోస్) సభ్యులు కూడా వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీఎస్పీ తరఫున పోటీ చేసిన మల్గ యాదయ్య కేవలం 738 ఓట్లను మాత్రమే సాధించినా.. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో బీఎస్పీతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
టీజేఎస్ తరఫున బీసీ అభ్యర్థి..2018 ఎన్నికలకు ముందే పురుడుపోసుకున్న ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) కూడా మునుగోడులో అభ్యర్థిని బరిలోకి దించింది. చండూరు మండలం బోడంగిపర్తికి చెందిన పల్లె వినయ్‌కుమార్ ఈ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఈయన భార్య గతంలో అక్కడ గ్రామ సర్పంచ్‌గా చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈయనకు మద్దతుగా పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రచారం చేయనున్నారు. చండూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మరోవైపు వైస్సార్‌టీపీ పేరిట పార్టీ స్థాపించిన షర్మిల.. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ, సన్నిహితుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఆమె మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. కాగా, చిన్న పార్టీలతో పాటు పెద్దసంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు మునుగోడు బరిలో ఉన్నారు. వీరికి కేటాయించిన గుర్తులు కారు, కమలం గుర్తులను పోలి ఉండటంతో.. తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని టీఆర్‌ఎస్, బీజేపీ ఆందోళన చెందుతున్నాయి.
ప్రధాన పార్టీలకు సవాల్..మునుగోడులో ముక్కోణపు పోటీ జరుగుతుందని అందరూ భావిస్తున్నా.. చిన్న పార్టీలు సైతం ప్రచారంలో దూసుకెళ్తూ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నాయి. ముఖాముఖిగా సాగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే చిన్న పార్టీలు, స్వతంత్రులు దాదాపు 6 శాతం ఓట్లను సాధించారు. ఈసారి ముక్కోణపు పోటీలో వీరి ఓట్లశాతం పెరిగితే ప్రధాన పార్టీ గెలుపోటములూ ప్రభావితయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో 90శాతానికి పైగా పోలింగ్ నమోదైన అతితక్కువ నియోజకవర్గాల్లో మునుగోడు కూడా ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో 91.30 శాతం పోలింగ్ నమోదు కాగా, 49 శాతం ఓట్లతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 37 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు.
బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి 6.40 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఆరు చిన్న పార్టీలు పోటీచేసి 6207 (3.12%) ఓట్లను సాధించాయి. అలాగే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు సైతం 4891 (2.46%) ఓట్లను రాబట్టారు. మూడు ప్రధాన పార్టీలను మినహాయిస్తే.. చిన్నపార్టీలు, స్వతంత్రులు 11,098 (5.58%) ఓట్లను సాధించాయి. అయితే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీగా మారింది. విజయం తమదేనంటూ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ విజయాన్ని ఎక్కడ అడ్డుకుంటారన్న భయం ప్రధాన పార్టీల్లో ఉంది. దీంతో చిన్న పార్టీల నేతలను బుజ్జగించే ప్రయత్నంలో టీఆర్‌ఎస్, బీజేపీ నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
Updated Date - 2022-10-23T13:04:57+05:30 IST