కలెక్టరేట్‌కు చేరిన ఎలుకల పంచాయితీ.. ఇరువర్గాల ఆరోపణలు విని షాకైన పోలీసులు..
ABN, First Publish Date - 2022-12-20T16:14:52+05:30
పోలీస్ స్టేషన్లకు కొన్నిసార్లు విచిత్రమైన ఫిర్యాదులు వస్తుంటాయి. పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి చిత్రవిచిత్రమైన సమస్యలపై ఫిర్యాదులు చేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అయితే ప్రస్తుతం..
పోలీస్ స్టేషన్లకు కొన్నిసార్లు విచిత్రమైన ఫిర్యాదులు వస్తుంటాయి. పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి చిత్రవిచిత్రమైన సమస్యలపై ఫిర్యాదులు చేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో ఓ వృద్ధుడికి ఎలుకల కారణంగా విచిత్రమైన సమస్య వచ్చింది. దీంతో చివరకు ఏకంగా కలెక్టరేట్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు.. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి విచారించారు. వారి సమస్యలు విని చివరకు అంతా అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బలోద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 70ఏళ్ల బిసాహు రామ్ టాండన్ అనే వృద్ధుడికి వింత సమస్య వచ్చి పడింది. తన పొరుగింట్లో ఉంటున్న యువరాజ్ మార్కండే అనే వ్యక్తి.. తన వరి బస్తాలను (rice Bags) బిసాహు రామ్ ఇంటి గోడకు ఆనుకునేలా ఉంచడం వల్ల గొడవ మొదలైంది. వడ్ల తినేందుకు వచ్చే ఎలుకలు (Rats).. తన గోడకు రంధ్రాలు చేస్తున్నాయని, తద్వారా తన ఇల్లు పాడవుతుందని బిసాహు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ (quarrels) జరుగుతోంది. ఇటీవల ఈ గొడవలు మరింత పెరిగాయి. చివరకు బిసాహు.. ఏకంగా కలెక్టరేట్‌కు (Collectorate) చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఈ సమస్య స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
దీంతో ఇరు వర్గాలను పోలీసులు.. స్టేషన్‌కి పిలిపించి మాట్లాడారు. తనకు పిల్లలు ఎవరూ లేరని, పింఛన్ మీదే ఆధారపడి జీవిస్తున్నానని బిసాహు ఆవేదన వ్యక్తం చేశాడు. పొరుగింటి యువరాజ్.. తనకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా తన ఇంటిని పాడు చేయాలనే ఉద్దేశంతో వరి బస్తాలను తన ఇంటి గోడకు ఆనుకుని పెట్టారన్నాడు. దీంతో ఎలుకలు తన ఇంటి గోడకు రంధ్రాలు చేస్తున్నాయని వాపోయాడు. దీనిపై పొరుగింటి యువరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఎలుకలు రావడానికి నేనెలా కారణమవుతానను.. ఒకవేళ ఎలుకలు నా మాట వింటే అలా చేయొద్దని చెప్పేవాడిని’’ అని సమాధానం ఇచ్చాడు. చివరకు వీరి ఆరోపణలు విని అవాక్కవడం పోలీసుల వంతైంది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయంశంగా మారింది.
Updated Date - 2022-12-20T16:18:27+05:30 IST