మనిషి చర్మంతో బూట్లు.. ఖరీదు ఏకంగా రూ.22 లక్షలు..!?
ABN , First Publish Date - 2022-12-21T15:22:45+05:30 IST
గుట్టు చప్పుడు కాకుండా మనుషుల చర్మాన్ని..
ఎప్పుడైనా, ఎవరితో అయినా గొడవ పడినపుడు.. ఆవేశంలో నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటా' అంటుంటారు చాలా మంది. అయితే అది మాట వరసకు ఆవేశంలో అన్నది అయినా ఒకసారి దాన్ని వాస్తవంగా జరిగినట్టు ఊహించుకుంటే ఎలా ఉంటుంది?
ఎంతో భయంకరమైన ఈ ఊహను నిజం చేస్తున్నాయి.. నేటితరం ఫ్యాషన్ పోకడలు. గుట్టు చప్పుడు కాకుండా మనుషుల చర్మాన్ని డార్క్ వెబ్‌లో అమ్మేస్తున్నారు ఎంతో మంది. మనుషుల చర్మం ఉపయోగించి చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు వంటి వస్తువులు తయారుచేసి అమ్ముతున్నారు. ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో చెప్పులు, బ్యాగులు, పర్సులు మొదలైన వాటి తయారీకి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. అయితే అవన్నీ సహజంగా వ్యాపారకోణంలో జరుగుతున్నాయి. కానీ మనిషి చర్మంతో విలాసవంతమైన వస్తువులను తయారుచేయడం అనేది ఊహించలేనిది.
మనుషుల చర్మంతో చెప్పులు, పర్సులు, బ్యాగులు తయారుచేయడం కొత్తేమీ కాదని.. ఇది ఎన్నో ఏళ్ళ నుండి సాగుతున్న వ్యవహారమేనని కొందరు చెబుతున్నారు. కాగా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మనుషుల చర్మంతో బూట్లను తయారుచేయడం.. ఆఫ్రికన్ల చర్మాలతో మొదలయ్యిందని చెబుతున్నారు. అమెరికా యుద్ధ సమయంలో పట్టుబడిన ఆఫ్రికన్ బానిసల చర్మాలతో అమెరికన్లు బూట్లు తయారు చేయించుకున్నారని చరిత్రకారుల నమ్మకం.
3000 సంవత్సరాల క్రితమే స్కైతియన్స్ అనే గిరిజన తెగలు తమ శత్రువులను చంపి, వారి చర్మాన్ని దుస్తుల్లాగా ధరించేవారట. వీరిని సీరియల్ కిల్లర్స్ అని కూడా పిలిచారు. చరిత్రలో చూస్తే కొన్ని పుస్తకాలకు బైండింగ్‌లోనూ ఫోటో ఆల్బమ్ లకు బైండింగ్ కోసం మనుషుల చర్మాన్ని ఊపయోగించిన ఉదాహరణలు కనబడుతున్నాయి.
1954-9157 కాలాల మధ్య అమెరికాలోని ఒక సైకో కిల్లర్ మనుషులను చంపి, వారి చర్మాన్ని తన ఇంట్లో సోఫాలకు, కుర్చీలకు తొడుగులుగా ఉపయోగించేవాడట. మరీ ముఖ్యంగా మహిళలను చంపి వారి చర్మాన్ని తొడుగులుగా ఉపయోగించి.. వాటి మీద కూర్చోవడానికి, పడుకోవడానికి ఇష్టపడేవాడట. ఇలా ఎంతో భయానకమైన విషయాలు ప్రపంచ చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి.
కాగా, ప్రస్తుతం మనిషి చర్మాన్ని ఉపయోగించి తయారైన షూస్ 22 లక్షలు, పర్సు 11 లక్షల రూపాయలకు అమ్ముతున్నారట. మనిషి చర్మం ఒక అంగుళం ధర 827రూపాయలట. వీటి గురించి విన్న వారు ఇలా ఫ్యాషన్ కోణంలో మనిషి చర్మాన్ని ఉపయోగించడం కృూరమని వాదిస్తుంటే.. చర్మం కోసం జంతువులను చంపినపుడు ఇలాంటి ఆలోచన రాలేదా.. మనిషి చర్మాన్ని ఉపయోగించడంలో తప్పేముందని వాదించేవారు కొందరున్నారు. ఏది ఏమైనప్పటికీ మనిషి చర్మంతో తయారైన ఉత్పత్తులను అంత ధర వెచ్చించి కొనేవారు ఎవరు? వాటిని ఉపయోగించేవారు ఎవరు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందరూ ఇప్పుడు ఇదే ప్రశ్న వేస్తున్నారు.