Year Ender 2022: భారత్‌ను కలవరపెట్టిన ఆరు పరాజయాలు!
ABN, First Publish Date - 2022-12-24T15:34:38+05:30
కాలగర్భంలో మరో వత్సరం కలిసిపోతోంది. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే, మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు.
కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోతోంది. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే, మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు. ఇక, క్రికెట్‌ను ఒక మతంగా మార్చుకున్న ఇండియాలో, అదంటే పిచ్చి ప్రేమ కనబర్చే అభిమానులకు ఈ ఏడాది తీవ్ర నిరాశనే మిగిల్చింది. టీమిండియాకు ఈ ఏడాది ఏరకంగానూ కలిసిరాలేదు. వరుస ఓటములు జట్టును వేధించాయి. కెప్టెన్లు మారినా తలరాత మాత్రం మారలేదు. టీమిండియా ఎదుర్కొన్న ఆరు ఓటములు అభిమానుల హృదయాలను కలవరపెట్టాయి. అందులో టీ20 ప్రపంచకప్ ఓటమి ఒకటి. అంతకంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక చేతుల్లో పరాజయం పాలైంది. ఇవేకాదు, మరెన్నో పరాభవాలు జట్టును వెంటాడాయి.
మూడు ఫార్మాట్లలో సాధించిన 43 విజయాల ఆనందాన్ని ఆరు ఓటములు తుడిచిపెట్టేశాయి. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ కలిపి భారత జట్టు 67 మ్యాచ్‌లు ఆడింది. అందులో 43 విజయాలు సాధించింది. 20 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ టై కాగా, రెండు పూర్తి కాలేదు. వీటిలో ఆరు పరాజయాలు మాత్రం అభిమానుల గుండెలను మెలిపెడుతున్నాయి.
ఆ ఆరు మ్యాచ్‌లు ఇవే
* దక్షిణాఫ్రికా చేతిలో 1-2తో ఓటమి
మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు డిసెంబరు 2021లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించి 2021ని విజయంతో ముగించింది. ఆ తర్వాత 2022 వచ్చేసింది. అనంతరం జరిగిన రెండో టెస్టులో సఫారీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగో రోజు దక్షిణాఫ్రికా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి వారు ఉన్నప్పటికీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయి 2022ను ఓటమితో ప్రారంభించింది. ఇక, చివరిదైన మూడో టెస్టులోనూ భారత్‌కు నిరాశ తప్పలేదు. ఆ మ్యాచ్‌లో సఫారీలు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్నారు. 212 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడంలో బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా మరో ఓటమి వెక్కిరించింది.
* వన్డే సిరీస్‌లో మరింత దారుణ ఓటమి
టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్ అయినా గెలుస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, వన్డేల్లో టీమిండియా మరింత దారుణంగా ఆడింది. సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా, భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రెండో వన్డేలో భారత జట్టు 287 పరుగులు భారీ స్కోరు సాధించగా, బదులుగా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఇక మూడో వన్డేలోనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. సఫారీలు నిర్దేశించిన 288 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 283 పరుగులు మాత్రమే చేసి విజయానికి ఐదు పరుగుల ముందు బోల్తా పడింది.
టెయిలెండర్స్‌తో కలిసి దీపక్ చాహర్ చివర్లో అద్భుతంగా ఆడి విజయంపై ఆశలు రేపాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, 278 పరుగుల వద్ద 8వ వికెట్‌గా అవుటైన తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా ప్రొటీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి ఇద్దరి బ్యాటర్లు ఐదు పరుగుల తేడాతో అవుట్ కావడంతో భారత్ పోరాటం ముగిసింది.
* ఇండియా ఆశలను వమ్ము చేసిన ఇంగ్లండ్
ఇంగ్లండ్‌తో అప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఐదో టెస్టు జూన్ 2022కు వాయిదా పడింది. ఆ టెస్టును కూడా గెలిచి ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలవాలని భారత జట్టు ఉవ్విళ్లూరింది. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ప్రతిగా ఇంగ్లండ్ 284 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ టార్గెట్ 378 పరుగులు అయింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు భారీ షాకిచ్చారు. 109 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలిన్ పంపారు. దీంతో భారత్ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో కలిసి భారత కలలను కల్లలు చేశారు. ఇద్దరూ సెంచరీలు సాధించారు. 316 బంతుల్లో 269 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. క్రీజులో పాతుకుపోయిన వీరిని కదల్చలేని భారత్ ఓటమి పాలైంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నాలుగో రోజు వరకు భారత్ చేతిలోనే ఉన్న మ్యాచ్ చివరి రోజు అనూహ్యంగా చేజారి ఓటమి పాలైంది.
* ఆసియా కప్ సూపర్-4 పరాజయం
భారత్ ఇప్పటి వరకు ఏడు ఆసియా కప్ టైటిళ్లను వశం చేసుకుంది. 8వ టైటిల్ గెలుచుకునేందుకు యూఏఈలో అడుగుపెట్టిన టీమిండియాకు దారుణ పరాభవం ఎదురైంది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత హాంకాంగ్‌ను మట్టికరిపించి సూపర్-4లోకి ప్రవేశించింది.
ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్. ఫైనల్‌కు చేరుకోవాలంటే గెలవక తప్పని పరిస్థితి. ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగులో భారత్ పట్టుబగించింది. 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 110 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ విజయం ఖాయమనే అనుకున్నారంతా. కానీ చివర్లో తారుమారైంది. విజయానికి 12 బంతుల్లో శ్రీలంకకు 21 పరుగులు అవసరమైన వేళ భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్‌లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు అవసరం కాగా, అర్షదీప్ సింగ్ అడ్డుకోలేకపోయాడు. అతడి బౌలింగులో యథేచ్ఛగా ఆడుకున్న లంక బ్యాటర్లు విజయాన్ని తన్నుకుపోయారు. ఇండియా సూపర్-4లోనే ఇంటికొచ్చేసింది. ఫలితంగా 8వ సారి ఆసియా కప్ ఆశలు గల్లంతయ్యాయి.
* టీ20 ప్రపంచకప్‌లోనూ మారని రాత
టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించి భారత్‌ను ఇంటిముఖం పట్టించింది.
ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ 80, అలెక్స్ హేల్స్ 86 పరుగులు చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించిపెట్టారు. ఇండియన్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో సింగిల్ వికెట్ కూడా తీయలేకపోయారు. 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఇలాంటి ఓటమే ఎదురైంది. ఆ మ్యాచ్‌లోనూ భారత్ 10 వికెట్ల తేడాతో ఓడింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో టీమిండియా ఫైనల్‌కు చేరలేకపోయింది.
* ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ చేతిలో..
రెండు అంతర్జాతీయ టోర్నీల్లో ఓటములు, దక్షిణాఫ్రికా చేతిలో వన్డే, టెస్టు సిరీస్‌లలో ఓటమి, ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో పరాభవంతో ఉన్న టీమిండియాకు బంగ్లాదేశ్‌లో మరో దారుణ పరాభవం ఎదురైంది. తొలి వన్డేలో భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహల్ ఒక్కడే 73 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, మెహదీ హసన్ మిరాజ్(38), మిస్తాఫిజుర్ రహ్మాన్ (10) అసమాన పోరాట పటిమతో జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. చెత్త ఫీల్డింగ్, క్యాచ్‌లు జారవిడవడం వంటివి భారత్ పుట్టిముంచాయి. ఈ ఓటమితో ఐసీసీ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది. ఏడాది ప్రారంభంతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి, చివరి నెలలో బంగ్లాదేశ్ చేతిలో దారుణ పరాభవం రెండూ భారత అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆ తర్వాత జరిగిన రెండో వన్డేలోనూ ఓడిన టీమిండియా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
షాకిచ్చిన విరాట్ కోహ్లీ
15 జనవరి 2022లో భారత జట్టుకు తీరని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో 1-2 తేడాతో సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాలో రెండు, ఇంగ్లండ్‌లో 3, దక్షిణాఫ్రికాలో రెండు టెస్టు సిరీస్‌లను సాధించింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి నుంచి అభిమానులు తేరుకోకముందే టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పేసి మరో షాకిచ్చాడు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ
కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్ శర్మను కెప్టెన్‌గా, లోకేశ్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. అంతకు ఏడాది ముందు నుంచి టెస్టు జట్టులోనే చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్‌కు పగ్గాలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, విదేశాల్లోనూ రోహిత్ ప్రదర్శన అంతంత మాత్రమే. దీనికితోడు అతడు తరచూ గాయాలబారిన పడుతున్నాడు. మొత్తంగా చూస్తే 2022 భారత్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. భారత క్రికెట్ చరిత్రలో ఈ ఏడాది అత్యంత బాధాకరమైన ఏడాదిగానే మిగిలిపోనుంది.
Updated Date - 2022-12-24T16:22:43+05:30 IST