Bharat Rashtra Samithi: ఆరంభంలోనే కొత్త చిక్కు
ABN, First Publish Date - 2022-12-13T20:51:37+05:30
తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi)గా మారి ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ స్థాయి పార్టీగా ఎదిగే క్రమంలో తొలి చిక్కును ఎదుర్కొంటోంది.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi)గా మారి ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ స్థాయి పార్టీగా ఎదిగే క్రమంలో తొలి చిక్కును ఎదుర్కొంటోంది. అది భాషకు సంబంధించిన చిక్కు.
తెలంగాణలో అది కూడా హైదరాబాద్‌లో చాలామంది హిందీ (Hindi) చక్కగా మాట్లాడతారు. ఉర్దూ (Urdu) హిందీ కాంబినేషన్‌లో ప్రజలు మాట్లాడుకోవడం అతి సాధారణమే. కూరగాయలు అమ్మేవారి నుంచి విమానం టికెట్లు అమ్మేవారి దాకా అందరి మధ్యా హిందీ భాషలో కమ్యూనికేషన్ జరుగుతునే ఉంటుంది. హిందీ వస్తే చాలు హైదరాబాద్‌లో హాయిగా బతికేయొచ్చని అంతా అంటుంటారు. సామాన్య ప్రజానీకమే ఇలా హిందీలో బ్రహ్మాండంగా మాట్లాడుకుంటుంటే ప్రజాప్రతినిధులు కూడా హిందీలో దంచికొడ్తుంటారు. అయితే జాతీయ స్థాయిలో విస్తరించాలనుకుంటోన్న బీఆర్ఎస్‌లో హిందీలో బాగా మాట్లాడలేకపోవడం నేతలకు ఓ మైనస్ పాయింట్‌గా మారబోతోంది. జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో రైతు విభాగాలు, కోఆర్డినేటర్లు, ఇతర పదవుల కోసం హిందీ బాగా మాట్లాడేవారికే అవకాశాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు హిందీ ట్యూటర్లను పెట్టుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నారు.
టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు స్వయంగా మంత్రి కేటీఆర్(KTR) ఈ ఏడాది అక్టోబర్ 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. హిందీ జాతీయ భాష కాదని, హిందీని బలవంతంగా తమపై రుద్ద వద్దని లేఖలో రాశారు. కేంద్రం బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటోందని, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని లేఖలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్‌పటేల్ మార్గ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యాలయం భవనం పైన, చుట్టుపక్కల కూడా హిందీలోనే బీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కూడా కేసీఆర్... అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ హిందీ నినాదాలే చేశారు.
టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు హిందీపై ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించినా చెల్లింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో వెళ్లాలనుకున్నప్పుడు, ఉత్తరాదిలో పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు కూడా హిందీని వ్యతిరేకిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Updated Date - 2022-12-13T20:52:54+05:30 IST