నా ప్రచారాన్నే అడ్డుకుంటార్రా.. తొక్కుత నా కొడుకుల్లారా..
ABN, First Publish Date - 2022-10-24T03:23:45+05:30
నా ప్రచారాన్ని అడ్డుకునే దమ్ముందారా.. తొక్కుత నా కొడుకుల్లారా’ అంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఓపికతో ఉంటున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు
తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్ రూరల్, అక్టోబరు 23: ‘నా ప్రచారాన్ని అడ్డుకునే దమ్ముందారా.. తొక్కుత నా కొడుకుల్లారా’ అంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం, నేలపట్ల ఎస్. లింగోటం, చిన్న కొండూరు గ్రామాల్లో ప్రచారం ముగించుకుని వెళుతున్న రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. నేలపట్లలో బీజేపీ ప్రచార రథాన్ని టీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత రాజగోపాల్‌రెడ్డి ప్రసంగిస్తుండగా టీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీపీఎం కార్యకర్త ఒకరు రాజగోపాల్‌రెడ్డికి చెప్పు చూపించారు. రాజగోపాల్‌రెడ్డి ప్రసంగం కొనసాగుతున్నంత సేపు ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దూసుకుపోవటానికి యత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ప్రసంగం ముగించుకొని వెళ్తుండగా టీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలు నినాదాలు చేయడంతో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహంతో వారికి వార్నింగ్ ఇచ్చారు. స్థానిక పోలీసులకు చేతకాకపోతే కేంద్ర పోలీసులను రప్పించి అంతుచూస్తానని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా మౌనంగా ఉంటున్న తనను రెచ్చగొడుతున్నారని, అయినా ఓపికతో ఉంటున్నానని, తన సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. జైకేసారంలో రాజగోపాల్‌రెడ్డి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్త రాజగోపాల్‌రెడ్డి నుంచి మైక్ లాగేందుకు ప్రయత్నించారు. దీంతో అతడిపై బీజేపీ కార్యకర్తలు దాడిచేశారు. పోలీసులు వెంటనే అందరినీ చెదరగొట్టారు. ఎస్.లింగోటంలో రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగా ఇరుపార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రసంగం ముగించుకొని రాజగోపాల్‌రెడ్డి వెళ్తుండగా మళ్లీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుతిరిగి కాన్వాయ్‌ని అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు భద్రత నడుమ రాజగోపాల్‌రెడ్డిని పంపించారు.
చిన్న కొండూరులోనూ..
మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ దుకాణం బంద్ కావాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్, మసీదుగూడెం, శేరిల్లా, పెద్దకొండూర్, మందోళ్లగూడెం, కుంట్లగూడెం గ్రామాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. టీఆర్‌ఎస్ పాలన వచ్చిన తర్వాతనే గంటకో పార్టీ మారే సంస్కృతి వచ్చిందని విమర్శించారు. రూ.30 కోట్ల సొంత ఖర్చుతో పిలాయిపల్లి కాలువను తవ్వించానని తెలిపారు. కాగా, చిన్నకొండూర్‌లో రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామంలో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు పెంచారని ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. కుక్కలు మొరిగితే పట్టించుకోవద్దు అంటూ రాజగోపాల్‌రెడ్డి ప్రచార రథాన్ని ముందుకు నడిపించారు. గ్రామ కూడలిలో రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించాక కాంగ్రె్‌సకు చెందిన దళితులు మరోసారి నిరసన తెలిపారు.
రోడ్డు ఎందుకు బ్లాక్ చేశారు..?
మంత్రి కేటీఆర్ గట్టుప్పల్‌లో ఉప ఎన్నిక ప్రచారం ముగించుకుని హైదరాబాద్ వెళుతుండగా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి వద్ద రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా నిలుపుదల చేశారు. అదే సమయంలో చౌటుప్పల్ చేరుకున్న రాజగోపాల్‌రెడ్డి పోలీసులను నిలదీశారు. మంత్రి కేటీఆర్ వెళుతుంటే వాహనాలను ఎందుకు నిలిపారని మండిపడ్డారు.
Updated Date - 2022-10-24T03:23:56+05:30 IST