YS Sharmila Arrest.. కారు దిగేందుకు నిరాకరణ.. క్రేన్‌తో లిఫ్ట్ చేసి స్టేషన్‌కు తరలింపు
ABN, First Publish Date - 2022-11-29T13:47:21+05:30
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉండిపోయారు. దీంతో సోమాజిగూడ పరిసర ప్రాంతాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు.. షర్మిల ఉన్న కారును క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
షర్మిలను పీఎస్‌లోకి తీసుకెళ్లిన పోలీసులు
షర్మిలను అరెస్ట్ చేయడంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్రేన్ సాయంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు... అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచారు. అనంతరం షర్మిలను పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కు భారీగా వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పంజాగుట్టలో షర్మిలపై కేసు
షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వీఐపీ మూమెంట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలపై 353, 337 సెక్షన్లల కింద కేసు నమోదు అయ్యింది.
కాగా .. ప్రగతిభవన్ వద్ద ఉదయం నుంచి కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేస్తానని...శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని షర్మిల కోరారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తున్నారనే ముందస్తు సమాచారంతో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2022-11-29T14:52:35+05:30 IST