Munugode by Election : మోసగాళ్లు.. మెగా మోసగాళ్లకు మధ్య మునుగోడు ఉప ఎన్నిక
ABN, First Publish Date - 2022-11-04T05:29:02+05:30
రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మోసగాళ్లు, మెగా మోసగాళ్లకు మధ్య జరుగుతోందని.. బీజేపీ నాయకులు మోసగాళ్లయితే.. సీఎం కేసీఆర్ మెగా మోస..
కేసీఆర్ మెగా మోసగాడు: షర్మిల
జగిత్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మోసగాళ్లు, మెగా మోసగాళ్లకు మధ్య జరుగుతోందని.. బీజేపీ నాయకులు మోసగాళ్లయితే.. సీఎం కేసీఆర్ మెగా మోసగాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని బుద్దేశ్‌పల్లి, ధర్మపురి పట్టణం, బూరుగుపల్లి, రాయపట్నం గ్రామాల్లో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోతో పాటు, ధర్మపురిలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్న నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ధర్మపురి ఈ ఆలయానికి రూ.వందల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పూటకోమాట చెప్పాడన్నారు. ఒకమారు రూ.500 కోట్లనీ, మరోమారు రూ. 200 కోట్లనీ, ఇంకోమారు రూ.100 కోట్లు అన్నాడని విమర్శించారు. మనుషులనే కాదు.. దేవుళ్లను సైతం కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పిన లక్ష్మీనృసింహ స్వామి రిజర్వాయర్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రిజర్వాయర్ కోసం ఒక్క తట్టెడు మట్టినైనా ఎత్తలేదని విమర్శించారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దగా చేసిన మెగా మోసగాడు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను మొత్తం దోచుకుంటున్నాడని ఆరోపించారు. ఇంత అవినీతికి పాల్పడుతున్నా కనీసం అడిగేవారు లేకుండా పోయారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మాట మీద నిలబడే నాయకత్వం లేదన్నారు. అందుకే వైఎస్సార్‌టీపీని ఏర్పాటు చేశామని, ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే సంక్షేమ పాలన అందిస్తామని ఆమె చెప్పారు.
Updated Date - 2022-11-04T05:29:19+05:30 IST