Trains: రద్దు చేసిన రైళ్లు ఈ నెల 9 వరకూ పునరుద్ధరించే అవకాశాలు లేవట.. ఏఏ రైళ్లంటే..
ABN, First Publish Date - 2023-06-06T13:54:28+05:30
ఒడిసాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా విజయవాడ-విశాఖల మధ్య పలు రైళ్లను రద్దు చేయడంతో ఈ సెక్షన్‌లో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సామర్లకోట: ఒడిసాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా విజయవాడ-విశాఖల మధ్య పలు రైళ్లను రద్దు చేయడంతో ఈ సెక్షన్‌లో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు విజయవాడ, ఇటు విశాఖపట్నం ప్రాంతాలకు, వాటి ముందు స్టేషన్లకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ప్రమాదం కారణంగా పాడైన రైల్వే ట్రాక్‌ను సోమవారం నాటికి పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను యథాతథం చేసినప్పటికీ విజయవాడ-విశాఖపట్నం మధ్య ఇంకా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించకపోవడం వల్ల పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికం అయ్యింది.
పలు రైళ్లల్లో రిజర్వేషన్ బోగీలలో సైతం కిక్కిరిసిన ప్రయాణికులు ఎక్కడం వల్ల టిక్కెట్ కలెక్టర్లు సైతం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరోపక్క రిజర్వేషన్ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పలు బోగీలలో గేట్ల వద్ద వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ రైల్వే అధికార యంత్రాంగం ఏమాత్రం స్పందించకపోవడం విచారకరం అని పలువురు వాపోతున్నారు. కాగా రద్దు చేసిన రైళ్లు ఈ నెల 9 వరకూ పునరుద్ధరించే అవకాశాలు లేవని అధికార వర్గాల సమాచారం. రద్దు అయిన పది రైళ్లల్లో సింహాద్రి మినహా మిగిలిన తొమ్మిది రైళ్లూ కరోనా ముందు కాలం వరకూ పాసింజర్ రైళ్లుగా చలామణి అవుతూ గ్రామీణ ప్రాంతాల వారికే కాకుండా పట్టణ ప్రాంతాలలో పేద వర్గాలకు సైతం ఎంతగానో సేవలందించేవి.
కరోనా అనంతరం వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పులు చేసినప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రయాణికులకు సేవలందిస్తూనే ఉన్నాయి. దీంతో కోరమాండల్ ప్రమాదానికి విజయవాడ-విశాఖ సెక్షన్ మధ్య పలు రైళ్ల రద్దుకు సంబంధం ఏమిటని పలువురు ప్రయాణికులు రైల్వే అధికారులను నిలదీస్తున్నారు. రద్దయిన రైళ్లల్లో 17240 నంబరుగల విశాఖ-గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, 22701 నంబరు గల విశాఖ-విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 17267 నంబరు గల విశాఖ-కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 17258 నంబరు గల కాకినాడ-విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 07467 నంబరు గల విశాఖ-రాజమండ్రి వెళ్లే ఎక్స్‌ప్రె్‌స, 17239 నంబరు గల గుంటూరు-విశాఖ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, 22702 నంబరు గల విజయవాడ-విశాఖ వెళ్లే ఎక్‌ప్రెస్, 17268 నంబరు గల కాకినాడ-విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 17257 నంబరు గల విజయవాడ-కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్, 07466 నంబరు గల రాజమండ్రి విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రె్‌సలు ఉన్నాయి.
Updated Date - 2023-06-06T13:54:30+05:30 IST