Lokesh: అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తామంటూ జగన్ మోసం..
ABN, First Publish Date - 2023-03-21T12:38:32+05:30
అనంతపురం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) 49వ రోజు మంగళవారం ప్రారంభమైంది.
అనంతపురం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) 49వ రోజు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కదిరి టౌన్ శివారు ప్రాంతంలో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను (Tidco Houses) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu) హయాంలో 90 శాతం పూర్తయిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) గత నాలుగేళ్లుగా పూర్తి చేయలేదని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. లబ్దిదారుల ఎంపిక లోనూ అన్యాయం చేశారని, టీడీపీ హయాంలో ఉన్న లబ్దిదారులను తొలగించి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని జగన్ (Jagan) హామీ ఇచ్చి మోసం చేశారని లోకేష్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం నిర్మించిన ఇళ్లను పూర్తి చేసి లబ్ది దారులకు ఇవ్వకుండా అనేక నిబంధనలు పెట్టి పేదవారిని వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. పట్టణ పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం టిడ్కో నేతృత్వంలో జీప్లస్ త్రీ తరహాలో మూడు రకాలు ఇళ్లు నిర్మించిందన్నారు. (365, 300, 430 SFT) పూర్తిగా షేర్‌వార్న్-టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లను నిర్మించామన్నారు.
300 చదరపు అడుగుల ఇంటికి రూ.500లు లబ్దిదారులు వాటా కాగా.. ఇది పూర్తిగా ఉచితం (సింగిల్ బెడ్ రూమ్) అని లోకేష్ అన్నారు. 365 చదరపు అడుగుల నివాసానికి లబ్దిదారుని వాటా రూ.50000/- (సింగిల్ బెడ్ రూమ్), 430 చదరపు అడుగుల నివాసానికి లబ్దిదారుని వాటా రూ.లక్ష ఉండగా, మిగిలిన దానికి బ్యాంకు లోన్ గత ప్రభుత్వమే మంజూరు చేయించిందని (డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు) లోకేష్ తెలిపారు. కదిరిలో సుమారుగా రూ. 205 కోట్లతో గట్లు వద్ద 1104 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులు, మౌలిక సదుపాయాలు వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కల్పించకుండా ప్రజల్ని వేధిస్తోందని, సుమారు 1800 మంది దరఖాస్తు చేసుకోగా 1104 మందిని ఎంపిక చేసి మిగిలిన వారికి డబ్బు ఇంకా వాపసు ఇవ్వలేదన్నారు. ఇళ్ళు నాలుగేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు.
టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా సెంటు స్థలం పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని వైసీపీ నాయకులు దోచుకున్నారని లోకేష్ విమర్శించారు. తక్షణమే మిగిలిన ఇళ్ల పనులు పూర్తి చేసి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని, ఉచితంగా ఇళ్లు కేటాయిస్తామని జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. డబ్బులు కట్టాలంటూ పేదల్ని వైసీపీ ప్రభుత్వం వేధించడం దారుణమని లోకేష్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-03-21T12:38:32+05:30 IST