AP CID SP: సోషల్ మీడియాలో అసభ్య ట్రోలింగ్స్.. వాటిపై కన్నేశాం
ABN, First Publish Date - 2023-08-04T15:47:20+05:30
సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసాలపై సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ స్పందించారు.
అమరావతి: సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసాలపై సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ (CID SP Harshavardhan) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయన్నారు. బ్యాంకు ఓటీపీలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, జూదం, బెట్టింగ్ ఉద్యోగ, ఆన్‌లైన్ రుణాలు మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం దేశంలో 2021లో 52,972 సైబర్ నేరాల నమోదు అయ్యాయని.. ఏపీలోనూ 1885 కేసులు రికార్డు అయ్యాయని చెప్పారు. ఏపీ సీఐడీ వీటిని చేధించేందుకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. సైబర్ నేరాలపై అడుకట్ట వేసేందుకు ప్రజల్లో చైతన్యం అవసరమన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అడ్డుకట్ట వేసేందుకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని సీఐడీ ఎస్పీ చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడో కూర్చుని కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో దూషణలు, అసభ్య ట్రోలింగ్‌లు జరుగుతున్నాయని.. దీనివల్ల సమాజంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతోందన్నారు. సోషల్ మీడియా ఫేక్ ఖాతాల ద్వారా సైబర్ బుల్లియింగ్ తదితర చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారిపై కన్నేసి ఉంచతున్నామని అన్నారు. ఆయా దేశాల విచారణ ఏజెన్సీలు, ఎంబసీల ద్వారా ఎక్కడ ఉన్నా వారిని చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సైబర్ బుల్లియింగ్‌లో 3 వేల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామన్నారు. అక్టోబర్ 7,8 తేదీల్లో సైబర్ హాక్‌థన్ విశాఖలో నిర్వహిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డేటా సేకరణపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే న్యాయపరమైన సలహాలు తీసుకుని వ్యవహరిస్తామని ఏపీ సీఐడీ ఎస్పీ హర్షవర్థన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-04T15:52:22+05:30 IST